త్వ‌ర‌లోనే ఎస్టీపీపీలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం

-సుమారు 6,800 కోట్లతో నిర్మాణానికి దేశ వ్యాప్త‌ టెండర్ల ఆహ్వానం
-ఈ నెలాఖ‌రులోగా తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
-మిగిలిన 10 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు మార్చిలో ప్రారంభం
-కార్యాచరణ ప్రణాళిక కు ఆదేశాలు జారీ
-సింగరేణి థ‌ర్మ‌ల్‌, సోలార్ విద్యుత్తు పై సమీక్షలో సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్

Construction of 800 MW plant in STPP soon: సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన మరో 800 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్లాంటు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణపు పనులు మార్చి నుంచి ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి థ‌ర్మ‌ల్‌, సోలార్ విద్యుత్‌ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ సుమారు రూ. 6,800 కోట్ల అంచనా వ్యయంతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థ‌ర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం నవంబర్ లో దేశ‌వ్యాప్త టెండ‌ర్ల‌కు ఆహ్వానం పలికింది. ఈ ప్రక్రియ త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేయాలని, జనవరి నుంచి నిర్మాణపు పనులు ప్రారంభించాలని శ్రీ‌ధ‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయ‌న ఆదేశించారు.

ఈ కొత్త ప్లాంట్ ను ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల ప్లాంటు ఆవరణలోనే నెలకొల్పబోతున్నారు. ప్రస్తుత ప్లాంట్‌కు గ‌ల బొగ్గు ర‌వాణా, నీటి వ‌స‌తుల‌ను ఈ కొత్త ప్లాంట్ కు కూడా వినియోగించుకునే అవ‌కాశం ఉన్నందున కొత్త ప్లాంట్‌కు అద‌నంగా ఈ రెండింటి విష‌యంలో నిర్మాణ వ్య‌యం త‌గ్గుతుంద‌ని, ఇదొక మంచి వెసులుబాటు కానున్న‌ద‌ని అధికారులు భావిస్తున్నారు.

ఈ నెలలోనే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం వాట‌ర్ రిజ‌ర్వాయ‌ర్ లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల‌ను వ‌చ్చే మార్చి నాటికి ప్రారంభించాల‌ని సీఅండ్ఎండీ ఆదేశించారు. వీటిలో తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ను ఈ నెలాఖ‌రు క‌ల్లా ప్రారంభించాల‌న్నారు. మూడో ద‌శ‌లో మిగిలిన 66 మెగావాట్ల‌ సోలార్ ప్లాంట్ల ను వ‌చ్చే జూన్ క‌ల్లా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. వీటిలో రామ‌గుండం 3 ఏరియాలోని ఓపెన్ కాస్టు 1 ఓవ‌ర్ బ‌ర్డెన్ డంప్ పైన తొలిసారిగా నిర్మిస్తున్న 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కూడా ఉంది. మిగిలిన వాటిలో చెన్నూరు ప్రాంతంలో 11 మెగావాట్లు, కొత్త‌గూడెంలో 33 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్ల‌కు సంబంధించిన టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్త‌యినందున ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

డీ స‌ల్ఫ‌రైజేష‌న్ యూనిట్ ప‌నులు పూర్తి చేయాలి
సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప్లాంట్ లో ప‌ర్యావ‌ర‌ణ హిత చ‌ర్య‌గా 700 కోట్లతో నిర్మించ‌నున్న ఫ్లు గ్యాస్ డీ స‌ల్ఫ‌రైజేష‌న్ యూనిట్ నిర్మాణం ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని సీఅండ్ఎండీ ఆదేశించారు. ఎస్టీపీపీ అత్య‌ధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట‌ర్ తో దేశంలోనే నెంబ‌ర్‌-1 స్థానంలో నిల‌వ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ (ఈ అండ్ ఎం) డి.స‌త్య‌నారాయ‌ణ రావు, చీఫ్ టెక్నిక‌ల్ క‌న్స‌ల్టెంట్ సంజ‌య్ కుమార్ సుర్‌, చీఫ్ ఆఫ్ ఓ అండ్ ఎం జె.ఎన్‌.సింగ్‌, ఎస్టీపీపీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ డి.వి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రాజు, జీఎం(సోలార్‌) జాన‌కిరామ్‌, చీఫ్ ఆఫ్ ప‌వ‌ర్ ఎన్‌.వి.కె.విశ్వ‌నాథ రాజు, ఏజీఎం(సివిల్‌) కె.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ఏజీఎం(ఫైనాన్స్‌) సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like