తల్లిపాలు సేపుతున్నయ్…
-శిశువుల తారుమారు కేసులో తల్లుల ఆందోళన
-విపరీతంగా రోదిస్తున్న చిన్నారులు
-కన్నీరు పెట్టిస్తున్న గర్భిణుల వేడుకోలు
-డీఎన్ఏ నివేదిక వచ్చేసరికి పదిహేను రోజులు
పుట్టగానే తల్లి ఒడిలో సేదతీరి, పాలు తాగి ఆడుకోవాల్సిన చిన్నారులు వారు.. అన్నెం, పున్నెం ఎరుగని ఆ చిన్నారులు తల్లి ఒడికి దూరమయ్యారు. చిన్నారులకు పాలిచ్చి మాతృత్వం అనుభవించాల్సిన తల్లులు వారు.. పొత్తిళ్లలో తమ పక్కనే ఉన్న చిన్నారులను చూసి ఆనందంతో తమ బాధను మర్చిపోవాల్సిన తల్లులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. మాతృత్వపు మధురిమతో చిన్నారుల ఆకలి తీర్చాలిన అమ్మ పాలు ప్రభుత్వాసుపత్రి పక్క తడుపుతున్నాయి.. అటు చిన్నారులకు, ఇటు తల్లులకు క్షోభకు కారణం ఎవరు…? తీరని వారి వేదన తీర్చేవారెవరు..?
మంచిర్యాల ఆసుపత్రి సిబ్బంది చేసిన చిన్న పొరపాటు అటు కన్నతల్లులను, ఇటు చిన్నారులకు శిక్షకు గురిచేస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ పట్టణంలోని రవీంద్రకాలనీకి చెందిన బొల్లం పావని, కోటపల్లి మండలం రొయ్యలపాడు గ్రామానికి చెందిన దుర్గం మమత ప్రసవం కోసం చేరారు. డిసెంబర్ 27 మంగళవారం రాత్రి ఇద్దరికీ ఒకే గదిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఒకరికి మగ, ఒకరికి ఆడ శిశువు జన్మించారు. వైద్య సిబ్బంది మగశిశువును దుర్గం మమత కుటుంబీకులకు అందజేశారు. నిమిషాల వ్యవధిలోనే మళ్లీ సిబ్బంది మమత కుటుంబీకుల వద్దకు వచ్చి పొరపాటు జరిగిందని మీకు పుట్టింది ఆడ శిశువు పుట్టిందని, మగశిశువుని ఇవ్వాలని చెప్పారు.
దీంతో మమతకు పుట్టింది మగ శిశువేనని తిరిగి ఇచ్చేది లేదని మొండికేశారు. అదే సమయంలో పావని కుటుంబ సభ్యులు మగ శిశువును తమకే ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. మగశిశువు కోసం ఇద్దరు బాలింతలు, బంధువులు పట్టుబట్టారు. దీంతో అధికారులు చేసేది ఏం లేక తలలు పట్టుకున్నారు. చివరకు చిన్నారులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి పిల్లలను వారికి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఆ నివేదిక వచ్చేందుకు పదిహేను రోజులు పడుతుంది. వైద్య పరీక్షల ప్రక్రియ ఆలస్యమైతే పన్నెండో రోజు తరువాత చిన్నారులను అదిలాబాదులోని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించనున్నారు. సాధ్యమైనంత మేర నివేదిక వచ్చేలా చూస్తామని ఆసుపత్రి సూపరింటిండెట్ చెప్పినా అది త్వరగా వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం తల్లుల ఎదురుచూపులు చూస్తుంటే మనసు ద్రవించిపోతోంది. తమ పిల్లలను మనసారా హత్తుకోవాలని, కడుపునిండా పాలివ్వాలని ఆ కన్నతల్లులు తపించిపోతున్నారు.
వచ్చిన వారి అందరినీ తన బిడ్డకు పాలివ్వాలని మమత వేడుకుంటోంది. ఒక్కసారి మా బాబుకి పాలివ్వనివ్వండి సారు… తర్వాత మీ ఇష్టం అంటూ ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంట తడిపెట్టిస్తోంది. ఇక చిన్నారులు సైతం విపరీతంగా ఏడుస్తున్నారు. అది సైతం అందరినీ హృదయవేదనకు గురి చేస్తోంది. వారి ఆవేదన కరుడు గట్టిన ఈ హృదయాలకు ఎప్పటికి అర్ధం కాదనుకుంటా..?