సింగరేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
*దేశీయ టెక్నాలజీ, సోలార్ పలకల వినియోగంతో ప్లాంట్ నిర్మాణం
*ఎస్టీపీపీ జలాశయంపై నిర్మాణం
*5 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించిన డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు
*మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం
Singareni: సింగరేణి సోలార్ విద్యుత్ ఉత్పాదనలో మరో కొత్త మైలురాయిని దాటింది. మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జలాశయంలో తొలి ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ శనివారండైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారాయణ రావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ ప్రత్యేక చొరవ, దిశా నిర్దేశంలో సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్లను విజయవంతంగా ఏర్పాటు చేస్తోందన్నారు. తొలిసారిగా చేపట్టిన 5 మెగావాట్ల ప్లాంట్ తక్కువ సమయంలోనే పూర్తిచేశామని వెల్లడించారు. ఇక్కడే మరో 10 మెగావాట్ల ప్లాంట్ కూడా త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. సంస్థ ఛైర్మన్ ప్రత్యేక చొరవతోనే దేశంలోని కోలిండియా, ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఎక్కడా లేని విధంగా సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ ప్లాంట్ నిర్మాణ సారథ్యం వహించిన అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే జలాశయంపై ఏర్పాటు చేసే మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం రెండేళ్ల కిందట ప్రారంభం కాగా.. మొత్తం మూడు దశల్లో 300 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేలా సీఅండ్ఎండీ రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం-3, మందమర్రి ఏరియాల్లో నిర్మించి ప్రారంభించారు.
ఈ ప్లాంట్లు అన్నీ సమర్థంగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 540 మిలియన్ యూనిట్ల విద్యు త్ ఉత్పత్తి చేయగా.. కంపెనీకి సుమారు రూ. 300 కోట్ల రూపాయల ఆదా అయింది. మూడో దశ లో నిర్మించే మొత్తం 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీని లో భాగంగా మొత్తం 15 మెగా వాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు దేశంలో ఫ్లోటింట్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో అనుభవం ఉన్న నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
ఎస్టీపీపీలో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విశేషాలు ఇవే..
*ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇదే. (కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ రామగుండంలో ఇటీవలనే 100 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించిన విషయం తెలిసిందే)
*సింగరేణి నిర్మించిన ఈ 5 మెగావాట్ల ప్లాంట్ డిజైన్ దేశీయంగా తొలిసారిగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించడం విశేషం.
*మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్లాంట్ లో వినియోగించిన అన్ని సోలార్ పలకలు భారత దేశంలోనే తయారవడం మరో విశేషం.
*ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎస్టీపీపీ జలాశయం-1 లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
*సాధారణంగా నేల పై ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ కు ఒక మెగావాట్‌కు ఐదెకరాల స్థలాన్ని సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ సింగరేణి సంస్థ తన ప్లాంట్ లోనే ఉన్న జలాశయం నీటి ఉపరితలాన్ని వినియోగించడం ద్వారా భూ సేకరణ అవసరం ఏర్పడలేదు.
*సాధారణంగా జలాశయాల్లో ఉన్న ఎండ వల్ల నీరు కొంత శాతం వరకు ఆవిరి అవుతూ ఉంటుంది. అయితే సౌర పలకలను నీటిపై ఉంచడం వల్ల ఆవిరి అయ్యే నీరు సుమారు 70 శాతం వరకు తగ్గుతుంది.
*ఈ ప్లాంట్ లో తొలిసారిగా ఫ్రేమ్ లెస్ మల్టీ క్రిస్ట లైన్ మాడ్యూల్స్ ను వినియోగించారు
*ఈ ప్లాంట్ రోజుకు సగటున 27 వేల యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 10 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.
*రూ.26 కోట్లతో నిర్మించిన ఈ ప్లాంట్ తో సింగరేణికి ఏడాదికి రూ.3 కోట్ల లాభం చేకూరనుంది.
*ఉత్పత్తి అయిన విద్యుత్ 6 ఇన్వర్టర్ల ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
*ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్ సంస్థ జైపూర్ 33/11 కె.వి. స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, ఎస్టీపీపీ చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎస్.కె.సూర్, జీఎం(సోలార్) జానకీరామ్, ఎస్టీపీపీ జీఎం డి.వి.సూర్యనారాయణ రాజు, జీఎం (పర్చేజ్, ఎస్టీపీపీ) వై. రాజశేఖరరెడ్డి, డీజీఎం సిహెచ్. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.