పోలీసుల వసూళ్ల పంచాయతీ
ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో పోలీసుల్లో అవినీతి లేకుండా చేసేందుకు అధికారులు సైతం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే, కిందిస్థాయి సిబ్బంది మాత్రం తమ పాత ధోరణి మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసుల పరువు బజారున పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా బీమారం ఠాణాలో పోలీసుల వసూళ్ల పంచాయతీ కొనసాగుతోంది. ఈ వ్యవహారం కాస్తా అధికారుల దృష్టికి సైతం వెళ్లింది. వారు హెచ్చరించినా సిబ్బంది తమ తీరు మార్చుకోకపోవడం పట్ల వారు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. బీమారం ఠాణాకు కొత్తగా వచ్చిన కొందరు కానిస్టేబుళ్లు, ఇక్కడ ఉన్న వారితో వసూళ్ల వ్యవహారంలో తేడా వచ్చింది. దీంతో వారు తరచూ గొడవ పడుతున్నారు.
కొద్ది రోజుల కిందట మహారాష్ట్రలోని సిర్వంచలో ఉన్న ఓ బియ్యం వ్యాపారి వద్ద ప్రతి నెలా వచ్చే మామూళ్లలో కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లు వెళ్లి తెచ్చుకున్నారు. దీంతో పాత వారు వస్తే అందరికీ సమానంగా రావాలని లేకపోతే ఎలా అంటూ వాగ్వాదానికి దిగారు. మరి కొందరు వెహికల్ చెకింగ్ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించుకుని వాహనాలు వదిలేస్తున్నారనే ఆరోపణలు సైతం గుప్పుమన్నాయి.
ఈ వ్యవహారం కాస్తా సర్కిల్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో ఆయన సీరియస్ అయ్యి సిబ్బందిని మందలించారు. అయినా కొందరు తమ తీరు మార్చుకోవడం లేదని సమాచారం. దీంతో ఈ వసూళ్ల పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కింది స్థాయి సిబ్బంది వ్యవహారంలో జోక్యం చేసుకుని కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.