పగిలిపోద్ది…
-ఎమ్మెల్యే రేఖా నాయక్ మాస్ వార్నింగ్
-చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు
-ఇతర పార్టీల్లో గెలిచి మా దాంట్లోకి వచ్చిన వారే కబ్జాలు చేస్తున్నారు
-తహసీల్దార్ల పనితీరుపై సైతం అనుమానాలు ఉన్నాయి
-ఎన్నికలు వస్తున్నాయని కబ్జాలు నాకు అంటగడితే ఎలా..?
కబ్జాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని, ఏ పార్టీ వారైనా విడిచిపెట్టేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఎమ్మెల్యేకు బీజేపీ నేత ఒకరు ఫోన్ చేశారు. టీఆర్ఎస్ సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కబ్జాలు చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చెరువు కబ్జాలో మీ పేరు ఉందంటూ ఎమ్మెల్యేతో స్పష్టం చేశారు. తాను తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం గడిపానని చెప్పిన ఎమ్మెల్యే రేఖా నాయక్, తాను భూమి కబ్జా చేశానని, డబ్బులు అడిగానని ఎక్కడైనా ఆరోపణలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌కు వార్నింగ్ ఇచ్చానని, విలేకరుల సమావేశం పెట్టాలని తాను ఆదేశించినట్లు వెల్లడించారు.
చెరువు కబ్జా విషయంలో కలెక్టర్‌తో మాట్లాడానని చెప్పారు. జన్నారంలో 200 సర్వే నంబర్ కబ్జా విషయంలో అసెంబ్లీలో సైతం చర్చించినట్లు స్పష్టం చేశారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని భూములు కబ్జాలు చేయడానికా అని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎట్ల కబ్జా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడి జాగీరా..? అని అన్నారు. తహసీల్దార్‌తో మాట్లాడిన ఆమె విషయం కనుకున్నారు. రాజ్‌కుమార్ ఎమ్మార్వోగా ఉన్నప్పుడు పట్టా మార్పిడి జరిగిందని తహసీల్దార్ తెలిపారు. కబ్జాలకు సంబంధించి పట్టాలు క్యాన్సల్ చేసి ప్రభుత్వ భూమి వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. మీ మీద కూడా అనుమానాలు ఉన్నాయని తహసీల్దార్‌ను హెచ్చరించారు. భూముల పట్టాలు చేస్తున్నారని తనకు సమాచారం ఉందని ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడి కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడుతామని, ఆ భూమి ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఓ ఆంధ్రా వ్యక్తి చెరువులో మట్టి పోస్తే మీరెందుకు చర్యలు తీసుకోలేదని తహసీల్దార్ ను ప్రశ్నించారు. పని ఆపించామని తహసీల్దార్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు చెప్పడంతో నేను కలెక్టర్‌కు చెప్పిన తర్వాత పని ఆపించారని అంతకు ముందు ఎందుకు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అక్కడే ఉంటారు కదా..? చూసుకోవాలి కదా అని సీరియస్ అయ్యారు.
ఎవడో కబ్జాలు చేస్తడు.. నాకేం సంబంధం.. భూమి దగ్గరకు వెళ్లండి, సరిహద్దులు వేయించండి. కలెక్టర్‌తో మాట్లాడుతా… ప్రభుత్వ భూమి కబ్జాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. తనపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై సైతం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మహిళనని ఇష్టం వచ్చినట్లు రాస్తే తాను కూడా ఊరుకోనని స్పష్టం చేశారు.
బీజేపీ నేత మరోమారు మాట్లాడుతూ కిష్టాపూర్ చెరువు సైతం కబ్జాకు గురైందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఉన్న తహసీల్దార్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని ఎమ్మెల్యేకు చెప్పడంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఇక్కడ నుంచి పంపిచామని ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ సైతం అదేవిధంగా చేశారని రేఖానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారానికి ఏ తహసీల్దార్ వచ్చినా డబ్బులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
జన్నారంలో 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లు వస్తే కనీసం ప్రభుత్వ భూమి లేదని ఆ విషయం కూడా అసెంబ్లీ వరకు తీసుకువెళ్లాల్సి వచ్చిందన్నారు. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయకపోతే ఉండి ఎందుకంటూ..? తహసీల్దార్‌ను నిలదీశారు. సోమవారం పోలీసులను తీసుకుని ఏ పార్టీ వారైనా వదలవద్దంటూ స్పష్టం చేశారు. అసలైన బీఆర్ఎస్ పార్టీ వారు కబ్జాలు చేయడం లేదని ఇతర పార్టీల్లో గెలిచి మాదాంట్లోకి వచ్చిన వారు కబ్జాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్, బీజేపీ నేత ఆడియో వైరల్ సర్వత్రా చర్చనీయాంశమైంది..