ఫీజు రీయెంబర్స్‌మెంట్ తో చేయూత
-జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్
-ఉద్యోగిని కుమారుడికి రూ.లక్ష ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెక్కు అందజేత
ప్రతిభావంతులైన సింగరేణి కార్మికుల పిల్లలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మెరిట్ స్కాలర్ షిప్, ఫీజు రీయెంబర్స్‌మెంట్ పథకాలతో అనేక మంది లబ్ధి పొందారని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ పేర్కొన్నారు. బుధవారం సింగరేణి భవన్లో పనిచేస్తున్న శ్రీలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడి ఐఐటీ చదువు కోసం మంజూరైన చెక్కు అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి హామీ, సీఅండ్ఎండీ శ్రీధర్ ఆదేశాలతో ఐదేళ్ల క్రితం ఫీజు రీయెంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకు సుమారు రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సింగరేణి సంస్థ భరిస్తోందని తెలిపారు.
ఐఐటీల్లో చదువుతున్న 27 మంది, ఐఐఎంలలో చదువుతున్న 9 మంది ఉద్యోగుల పిల్లలు ఫీజు రీయెంబర్స్‌మెంట్ పథకంతో ఇప్పటి వరకు లబ్ధి పొందారని పేర్కొన్నారు. మెరిట్ స్కాలర్ షిప్‌ల ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 150 మంది లబ్ధి పొందారని వివరించారు. ఐఐటీ మద్రాస్ లో చదువుతున్న తన కుమారుడి కి మంజూరైన చెక్కును స్వీకరించిన శ్రీలక్ష్మి సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, డీజీఎం(పర్చేజ్) విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.