నన్ను ఎన్నిసార్లు చంపుతారు
-సోషల్ మీడియా పోస్టులు చూసి బందోబస్తుకు వచ్చిన పోలీసులు
-మరణించాడంటూ వచ్చిన వార్తలపై మండిపడ్డ కోటా
- బతికే ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన సినీ నటుడు

Kota Srinivas Rao: తాను మరణించానని సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సినీ నటుడు కోటా శ్రీనివాస్ మండిపడ్డారు. తాను బతికే ఉన్నానని.. రేపు ఉగాది వేడుకల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా విషయం తెలిసిందన్నారు. ఇలాంటి వార్తల వల్ల తనలాంటి వారు మానసికంగా బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశారు…
ఇంతకీ ఏం జరిగిందంటే… కోటా శ్రీనివాస్ రావు చనిపోయారంటూ మంగళవారం ఉదయం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ దర్శనమిచ్చాయి. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆ వార్తల సారాంశం. అసలే టాలీవుడ్ లో పలువురు దిగ్గజ నటులు ఈ మధ్య వరుసగా చనిపోయిన నేపథ్యంలో వయో వృద్ధుడైన కోటా శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు పలువురు భావించారు కూడా. ఆయన అభిమానులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న కోటా శ్రీనివాస్ రావు తాను బతికే ఉన్నానంటూ తాను బతికే ఉన్నానంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. ఓ పది మంది పోలీసులతో కూడిన టీంను సైతం ఉన్నతాధికారులు పంపించారు. దీనిపై స్పందించిన కోటా శ్రీనివాస్ రావు ఎవడో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట. రేపు ఉగాది కావడంతో పండగ ఎలా నిర్వహించాలని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్. నేనే యాబై కాల్స్ మాట్లాడానని స్ఫష్టం చేశారు.
‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. లోకంలో డబ్బులు సంపాదించాడని అనేక మార్గలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపు కోవద్దు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు…’ అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. గతంలో సుమన్, చంద్రమోహన్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు జీవించి ఉండగానే మరణించారంటూ వార్తలు వెలువడగా, ఆ వార్తలపై సదరు నటులు మండిపడ్డారు.