నిజాం పాలనలో కూడా ఇంత నియంతృత్యం లేదు
-అడవి పుత్రులను ఇబ్బంది పెడితే ఉద్యమమే
-గిరిజనులను వెళ్లగొట్టాలని చూస్తున్నారు
-వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
CLP Leader Mallu Bhatti Vikramarka: నిజాం పరిపాలనలో కూడా గిరిజనులపై ఇంత నియంతృత్యం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గిరిజనులను బయటికి పంపించి కలప మాఫియాకు అడవి అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి గిరిజనులకు ఇల్లు అని దానికి వారు ఎలాంటి నష్టం చేయరని స్పష్టం చేశారు. అడవిలో మమేకమై బతుకుతున్న అడవి పుత్రులను ఇబ్బంది పెడితే ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
తెలంగాణ తెచ్చుకుందే ఆత్మగౌరవం కోసమని, గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టి వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని భట్టి విక్రమార్క వెల్లడించారు. గిరిజనుల బతుకులు మార్చడానికి కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంలో ఐటీడీఏలను నిర్వీర్యం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల బతుకులను అల్లకల్లోలం చేస్తున్నదని దుయ్యబట్టారు.
గిరిజనులకు ఇచ్చిన పట్టా భూములను రెవెన్యూ అధికారులు ధరణిలో ఆన్లైన్ చేయకపోవడంతో రుణమాఫీ కాక, రైతుబంధు రాక గిరిజనులు అన్ని పథకాలు కోల్పోతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం రేషన్ బియ్యం ఇస్తున్నందున వారు తినలేక పోతున్నారని అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచిదని, మరోవైపు రాష్ట్రప్రభుత్వం పొయ్యిలో పెట్టుకోవడానికి అడవి నుంచి కట్టెలు కూడా తెచ్చుకోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో ఉన్న గిరిజన బిడ్డలు ఎట్లా వండుకోవాలి..? ఏమి తినాలి..? అని ప్రశ్నించారు.
మీ హక్కులను కాపాడతాను.. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే.. అప్పుడు మీకందరికీ న్యాయం జరుగుతుందని మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ఆరో రోజైన మంగళవారం జైనూరు మండలం జామ్ని నుంచి ప్రారంభమై రాసి మెట్ట, బుసిమెట్ట, బూసి మెట్ట క్యాంపు మీదుగా కెరిమెరికి చేరుకున్నది. సుమారు 18 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. బూసి మెట్ట క్యాంపు గిరిజన మహిళలు భట్టి విక్రమార్క కొరకు వంట చేసుకుని తీసుకువచ్చి ఆయనతో కలిసి భోజనం చేశారు. జొన్న రొట్టెలు, తోటకూర పెసరపప్పు, ఉల్లిపాయ కారంతో చేసిన వంటకాలను తీసుకువచ్చి భట్టికి వడ్డించి ఆయనతో పాటు కలిసి తిన్నారు.