అల్లోల్ల… కల్లోలం…
-ఆయన నోరు తెరిస్తే వివాదాలే..
-లీకేజీలు కామన్ అన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-ప్రతిపక్షాల వ్యాఖ్యలకు బలం చేకూర్చిన బీఆర్ఎస్ నేత
-కాంగ్రెస్‌కు అస్త్రాన్ని అందించిన అల్లోల్ల
-నోరు జారి తల పట్టుకుంటున్న మంత్రి
Minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏ వ్యాఖ్యలు చేసినా అవి కాస్తా వివాదాలై కూర్చుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. గతంలో దళితబంధు విషయంలో ఆయన మాటలు వైరల్ కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గురించి మాట్లాడుతూ పేపర్ లీకేజీలు కామన్ అంటూ చేసిన ప్రసంగం సంచలనం సృష్టిస్తోంది. అది కాస్తా కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్లయ్యింది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు అవి ఆరోపిస్తున్నాయి. దాదాపు అన్ని పరీక్షల్లో పేపర్లు లీక్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతల దగ్గరి వారికి సీట్లు వచ్చేలా చేస్తున్నారని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు, ధర్నాలు సైతం నిర్వహిస్తున్నాయి. మిగతా పార్టీలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు సాగిస్తున్నాయి.
ఇదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేపర్ లీకేజీలు కామన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. పదో తరగతి, ఇంటర్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం సర్వసాధారణమని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఒక మంత్రి హోదాలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి ఆయనను అడ్డుకోవాలని నిరుద్యోగులు, యువతకు పిలుపునిచ్చారు. అడ్డుకున్న వారికి తాము అండగా ఉంటామని సైతం ప్రకటించారు. మంత్రి చిరకాల ప్రత్యర్థి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి సైతం మంత్రిపై విరుచుకుపడ్డారు. కబ్జాలు, ఉద్యోగాలు అమ్ముకోవడం మంత్రికి కామన్ అంటూ దుయ్యబట్టారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో సైతం మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తనకు దళితబంధు రాలేదని, పేదవాళ్లకు ఆ పథకం చేరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఓ దళిత మహిళపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇష్టమైన వారికే దళిత బంధు ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆమెను పక్కకి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. బీజేపీ వాళ్లతో తిరిగే వారు, ఆ నాయకులనే దళిత బంధు అడగాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.