భట్టి… నాగలి పట్టి…
-పాదయాత్రలోనే సీఎల్పీ నేత ఉగాది వేడుకలు
-పశువులకు పూజ చేసి అరక దున్నిన విక్రమార్క
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉగాది వేడుకలు పాదయాత్రలోనే నిర్వహించారు. పండగ రోజు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన కెరిమేరి మండలం బాలే మోడీలో రైతులతో ఉగాది వేడుకలు చేసుకున్నారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొదట పశువులకు పూజ చేశారు. జొన్నగటుక, పెసరపప్పుతో వండిన నైవేద్యాన్ని తినిపించారు. ప్రసాదాన్ని గిరిజనులతో కలిసి తిన్నారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క రైతులతో కలిసి అరకపట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఇంట్లో చేసిన వంటకాలు పశువులకు తినిపించడం సంప్రదాయమని అది పాటించడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనులతో కలిసి ఉగాది పర్వదినం జరుపుకోవడం ఆనందంగా ఉందని స్పష్టం చేశారు.