ప్రపంచ కుబేరుల జాబితా విడుదల
-టాప్ టెన్‌లో ఒకే ఒక్కడు అంబానీ
-దరిదాపుల్లో కనిపించని అదానీ
Anil Ambani: అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. హురూన్ వరల్డ్స్ టాప్ 10 బిలియనీర్స్ లిస్ట్‌లో అంబానీకి స్థానం దక్కింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాత్రం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు అంబానీనే కావడం విశేషం. అంబానీ తన సంపదలో 20 శాతం కోల్పోయినా.. 82 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఈలెక్క ప్రకారం ఆయన సంపద భారత కరెన్సీలో రూ. 6.77 లక్షల కోట్లు. అంబానీ వరుసగా మూడో ఏడాది ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.
గత ఏడాదితో పోలిస్తే 35 శాతం సంపద కోల్పోయిన అదానీ.. ఆసియాలోని కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అదానీ సంపద ప్రస్తుతం 53 బిలియన్ డాలర్లుగా ఉంది. హురూన్ సంస్థ లెక్కల ప్రకారం.. గౌతమ్ అదానీ గత ఏడాది నుంచి ప్రతి వారం రూ. 3 వేల కోట్ల చొప్పున కోల్పోయారు. ఇక అదానీ తన రెండో స్థానాన్ని చైనాకు చెందిన ఝాంగ్ షాన్షాన్కు ఇచ్చుకున్నారు. షాన్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్ల వరకు ఉంది.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదల అయినప్పటి నుంచి అదానీ సంపద పతనం అవుతూ వచ్చింది. తన గరిష్ట సంపద నుంచి ఏకంగా 60 శాతం వరకు సంపద కోల్పోయారు. ఈ రిపోర్ట్ వెలువడక ముందు అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలోనే 2వ స్థానంలో ఉండటం గమనార్హం.
భారత్‌లో నివసించే వారిలో 187 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇందులో 16 మంది కొత్తగా చేరారు. ప్రపంచదేశాల్లో కొత్తగా బిలియనీర్లను సృష్టిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత సంతతికి చెందిన వారిని కూడా ఇందులో చేరిస్తే మొత్తం ఆ సంఖ్య 217గా ఉంది.