భట్టి పాదయాత్రలో మార్పు..
CLP leader Mallu Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో ఎక్కువ రోజులు ఉండేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర ఖమ్మం జిల్లా వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూసిన నేతలు తమ ప్రాంతాల్లో కూడా ఆయన యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు.
బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో సైతం…
ఆసిఫాబాద్ జిల్లాల పర్యటన ముగించుకుని భట్టి మంచిర్యాల జిల్లాలో అడుగుపెడతారు. ప్రధాన రహదారి మీదుగా యాత్ర కొనసాగాల్సి ఉంది. కానీ, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు దాదాపు కవర్ అయ్యేలా నేతలు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. తాండూరు, బెల్లంపల్లి, నెన్నల, కన్నెపల్లి, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, బీమారం, జైపూర్ మీదుగా యాత్ర సాగనుంది. గతంలో ఈ ప్రాంతాలన్నీ ఆయన యాత్రలో లేవు.
మంచిర్యాలలో భారీ బహిరంగ సభ…
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు మంచిర్యాల పట్టణంలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు. వాస్తవానికి అది ఏప్రిల్ 2న నిర్వహించాల్సి ఉండగా, భట్టి పాదయాత్రలో మార్పు కారణంగా తేదీ మార్చుతున్నారు. ఈ బహిరంగసభకు రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఏఐసీసీ నుంచి నేతలను రప్పించేందుకు ప్రేంసాగర్ రావు ప్లాన్ చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో మార్పులకు సంబంధించి శనివారం పూర్తి స్పష్టత రానుంది.