ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
-మోదీ, అమిత్‌షా కుట్రలో భాగమే వేధింపులు
-రాహుల్‌గాంధీపై బహిష్కరణ అందరూ ముక్కకంఠంతో ఖండించాలి
-కాంగ్రెస్ వాదులు ఎవరూ భయపడరు
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కొమురం భీమ్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన రాహుల్‌పై అనర్హత వేటు విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయడం చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నట్లు భట్టి వెల్లడించారు.
రాహుల్ బహిష్కరణ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై జరుగుతున్న కుట్రగా చూడాలన్నారు. బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి సూరత్ కోర్టులో శిక్ష వేయించి న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్యవాదులు, లౌకికవాదులు, ప్రగతిశీలవాదులు, ప్రజల సంపద ప్రజలకే చెందాలని కోరుకునే వాళ్ళు రాహుల్ గాంధీ బహిష్కరణ వేటును ముక్తకంఠంతో ఖండించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ వెన్నంటి కోట్లాదిమంది ఉన్నారని మోడీ సర్కార్ గ్రహించాలన్నారు.
ఈ దేశం లౌకికవాదంతో ముందుకెళ్లాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రాహుల్ గాంధీ అన్నారు. ఆయనపై కేసు పెట్టి, జైలుకు పంపాలని మోడీ అమిత్ షా చేసే కుట్రల బెదిరింపులకు రాహుల్ లొంగడని స్పష్టం చేశారు. దేశం విచ్చినం కాకుండా దేశసమైక్యత, సమగ్రత కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదుల తుపాకీ తూట్ల వర్షానికి ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ రక్తం రాహుల్ లో ప్రవహిస్తున్నదని వెల్లడించారు.
దేశ సార్వభౌమత్వానికి ఎల్టీటీఈ తీవ్రవాదులతో పొంచి ఉన్న ముప్పును వ్యతిరేకించి మానవ బాంబుకు ముద్దైన రాజీవ్ గాంధీ రక్తం రాహుల్ గాంధీలో ప్రవహిస్తున్నదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ వారసుడు మోడీ అమిత్ షా బెదిరింపులకు భయపడడని అన్నారు. రాహుల్ గాంధీని ఎదుర్కోలేక పిరికిపందలైన మోడీ, అమిత్ షా తప్పుడు కేసులు పెట్టారన్నారు. జైలు శిక్ష పడేలాగా చేసి, జైలు శిక్ష పడిందని పార్లమెంటు నుంచి బహిష్కరించేందుకు చేసిన కుట్రలు దేశానికి మాయని మచ్చగా మిగులుతుందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.