చిరుధాన్యాలతో పూర్తి పోషకాలు
చిరుధాన్యాల వినియోగం ద్వారా శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు అందుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోషణ పక్ష వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాల వినియోగంపై ప్రజలందరికీ అవగాహన నిర్వహించాలన్నారు. చిరుధాన్యాలు వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. 2018 నుండి సెప్టెంబర్, మార్చ్ నెలల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు, 6 సంల పిల్లలు, కిశోర బాలికలకు చిరుధాన్యాల ద్వారా పౌష్టికాహారం అందించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలూ నిర్వహించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో కూడా చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి మార్చి 22 నుంచి ఈ నెల 3 వరకు పక్షం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు,
జిల్లాలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది, సి.డి.పి.ఓ.లు సమన్వయంతో కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. చిరుధాన్యాల వినియోగం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం పక్షం రోజుల పాటు పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు పోషకాహరంపై ప్రతిజ్ఞ చేయించారు. మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శ సందర్శించి పలు సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, జిల్లాలోని సి.డి.పి.ఓ.లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.