జవాబు పత్రాల గల్లంతులో ఇద్దరిపై వేటు
-పోస్టాఫీసు సిబ్బంది నిర్లక్ష్యంతోనే పత్రాల గల్లంతు
-ఇంకా దొరకని విద్యార్థుల జవాబు పత్రాలు
-విచారణ కొనసాగిస్తున్న పోలీసులు, అధికారులు
ఉట్నూరులో జవాబు పత్రాల గల్లంతులో పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. దగ్గరుండి జాగ్రత్తగా తరలించాల్సిన జవాబు పత్రాలు తమకేం పట్టన్నట్లు తీసుకువెళ్లారు. అందుకే జవాబు పత్రాలు మాయం అయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆటోలో జవాబు పత్రాలు తరలించిన సీసీ ఫుటేజీ చూస్తే ఇదే విషయం అర్దం అవుతోంది. ఆటోలో జవాబు పత్రాలను చాలా నిర్లక్ష్యంగా తరలించారు. ఏదైనా వాహనంలో జవాబు పత్రాలను పంపిస్తే అదే వాహనంలో సిబ్బంది ఎస్కార్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఉట్నూరులో జవాబు పత్రాలు పంపించే సమయంలో పోస్టల్ సిబ్బంది ఆటోలోనే లేరు.
ఇలా పోస్టల్ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. పోస్ట్ఆఫీస్ నుంచి ఆటోలో జవాబు పత్రాలను బస్టాండ్ తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఒక పేపర్ ప్యాక్ బండిల్ జవాబు పత్రాలు కనిపించకుండా పోయాయి.
ఈ జవాబు పత్రాల గల్లంతు వ్యవహారంలో ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంచార్జీ ఎస్పీఓ ఉమామహేశ్వర్ రావ్ ఉట్నూర్ పోస్ట్ ఆఫిస్లో సిబ్బందిని విచారించారు. తమ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జవాబు పత్రాలు మిస్ అయ్యాయని తెలిసిందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో పోలీసుల సైతం విచారణ నిర్వహించారు. అయితే విధుల్లో ఉన్న సిబ్బంది విచారణకు నిరాకరించారు. స్టేట్మెంట్ రికార్డుకు ఎంటిఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) రజిత నిరాకరిస్తున్నారని ఇంచార్జీ ఎస్పీఓ ఉమా మహేశ్వర రావ్ వెల్లడించారు. పోస్ట్ఆఫీస్లో పనిచేస్తున్న రజిత, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజులపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.