సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు తీయించాలి
జేఏసీ ఆధ్వర్యంలో కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో ధర్నా
Singareni: సింగరేణి కార్మికులు తీయాల్సిన బొగ్గును ఓబీ కాంట్రాక్టర్ ద్వారా తీయిస్తున్నారని,వెంటనే నిలిపివేయాలని కైరిగూడ ఓపెన్కాస్టులో టీబీజీకేఎస్, ఏఐటియుసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలువురు నాయకులు సైట్ ఆఫీసు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సింగరేణి అధికారులు ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. వారి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు సరైన మిషనరీ, మ్యాన్ పవర్ అందిస్తే సింగరేణి కార్మికులు ఎంతటి పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కైరిగూడ ప్రాజెక్టు అధికారి ఉమాకాంత్ గని మేనేజర్ ప్రవీణ్ పటింగ్ వారితో చర్చించారు. బొగ్గు ప్రైవేటు వారితో తీయించడానికి వెంటనే నిలిపివేయాలని నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్మికులు, నాయకులు కోరిన విధంగా సింగరేణి వారితోనే బొగ్గు తీస్తానని వెల్లడించారు. ఆర్డర్లో ఉన్న విధంగా పని చేయిస్తానని, ప్రైవేటు వారితో బొగ్గును తీయకుండా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇచ్చిన హామీతో ధర్నా విరమిస్తున్నామని, దానిని ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. గనిలో ఉత్పత్తి సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదన్నారు. ధర్నాలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి సోమవారపు తిరుపతి, ఐఎన్టీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి పేరం శ్రీనివాస్, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఓరుకొండ తిరుపతి, సిఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి అంబాల ఓదెలు, నాయకులు సంఘం ప్రకాష్ రావు, నల్లగొండ సదాశివ్, మారిన వెంకటేష్, గజేల్లి చంద్రశేఖర్, కృష్ణ, సంజీవరెడ్డి, మారం శ్రీనివాస్, జగ్గయ్య, శేషు, ఫిట్ కార్యదర్శులు కారనాతం వెంకటేష్, ఓరంకిరణ్, తిరుపతి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.