కానిస్టేబుల్ను కొట్టి… ఎస్ఐని నెట్టి…
=ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ షర్మిళ
=లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
=అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలింపు
Ys Sharmila: తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వైఎస్ షర్మిళ చేయి చేసుకున్నారు. ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టిన ఆమె, ఓ ఎస్ఐని నెట్టేశారు. కాసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమవారం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు అరెస్టు చేసి జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్ తరలించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల నిరుద్యోగ ధర్నాకు కారులో బయటకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. లేవమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. ఎస్ఐని తోసేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ అధికారుల తీరుపై షర్మిల మండిపడ్డారు. సొంత పనులకు బయటకు రాకుండా అడ్డుకుంటారా? అంటూ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విధంగా తనను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
దాడి ఘటన సీరియస్గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ రాగా లోపలికి అనుమతించలేదు.