బిడ్డ కొట్టింది… తల్లీ కొట్టిందీ…
పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ విజయమ్మ
YS Vijayamma: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఇద్దరూ సోమవారం పోలీసులపై చేయిచేసుకున్నారు. వీరిద్దరిని వేర్వేరుగా అరెస్టు చేస్తున్న క్రమంలో కానిస్టేబుళ్లపై చేయి చేసుకున్నారు. వైస్ షర్మిళ నిరుద్యోగ ధర్నాకు బయటకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. ఎస్ఐని తోసేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ రాగా లోపలికి అనుమతించలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించే క్రమంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే విజయమ్మ పోలీసుపై చేయి చేసుకున్నారు. ఆమెను నియంత్రిస్తున్న మహిళా పోలీసు చెంపపై కొట్టారు.
పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని, డ్రైవర్, షర్మిలపై తొలుత వారే దౌర్జన్యం చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న గొంతు మీదే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీళ్లకు చేతనైంది షర్మిలను అరెస్టు చేయడమే అని విమర్శించారు. తన కూతురిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ప్రశ్నించడానికి షర్మిల బయటకు వచ్చిందని, అందుకు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పీఎస్ ముందు విజయమ్మ కారులోనే కాసేపు ఉండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.తనను స్టేషన్ లోనికి వెళ్లనిచ్చేవరకూ అక్కడే ఉంటానని విజయమ్మ తేల్చి చెప్పారు. స్టేషన్ ముందే కారులో కూర్చొని నిరసన తెలిపారు.