రీల్స్ పిచ్చి… రైలు ఢీకొట్టింది…
Reels: రీల్స్, టిక్‌టాక్, షార్ట్స్ పేరు ఏదైతేనేమి ఎంతో మంది టైమ్ పాస్ కోసం సెల్ చూస్తూ ఉంటారు. మరెంతో మంది అదే పనిగా రీల్స్ చేసి పోస్టు చేస్తుంటారు. ఈ రీల్స్ తో పాపులారిటీ సంపాదించుకోవాలని చాలా మంది భావిస్తూ ఉన్నారు. లోకల్ గా సెలెబ్రిటీలు అవ్వడానికో పాపులారిటీ సంపాదించుకోడానికో కొందరు చేస్తున్న పిచ్చి పనులు ప్రాణాల మీదకు కూడా తీసుకుని వస్తున్నాయి.
రైల్వేట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా ఓ విద్యార్థి రైలు ఢీకొని మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం మహ్మద్ సర్ఫరాజ్ అనే విద్యార్ధి ఇద్దరు స్నేహితులతో కలిసి సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. ట్రాక్ వెంట తన ఇద్దరు మిత్రులతో వీడియో తీస్తున్న సమయంలో ఆ విద్యార్థిని వెనుక వైపు నుండి రైలు ఢీకొట్టింది. మరో ఇద్దరు విద్యార్థులు రైలును గుర్తించి పక్కకు తప్పుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. సర్ఫరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు శ్రీరామ్ కాలనీ రహ్మత్ నగర్ మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహ్మద్ సర్ఫరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిఫరెంట్ వీడియోలు పోస్టు చేస్తున్నట్టు గుర్తించారు. రీల్స్ చేస్తున్న ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.