గులాబీ పార్టీకి గుడ్‌బై
- సొంతగూటికి బీఆర్ఎస్ సీనియర్ నేత కూచాడి
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
- ప్రజలకు మేలు చేయట్లేదని సీఎంకు లేఖ
- కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెసులోకి
- పశ్చిమలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
BRS: ‘తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను విస్మరించారు.. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీలో పరాయివాళ్లలా మారాం.. ఎన్నికల సమయంలోనే ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తుకు వస్తున్నారు…’ ఇదీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూచాడి శ్రీహరి రావు ఆవేదన. ఆయన సోమవారం గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు.. ప్రజలకు మేలు చేయని పార్టీలో ఉండటం ఎందుకని.. సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల, పార్టీ మీద విశ్వాసం లేనందునే పార్టీ వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు. సోమవారం ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన ఆయన.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తొమ్మిదేళ్లుగా ఎలాంటి పదవులు, ప్రాధాన్యత లేకపోయినా.. పార్టీ కోసం పని చేశామని కార్యకర్తలు పేర్కొన్నారు. అవమానాలు ఎదురైనా పార్టీలో ఉన్నామని.. ఇకపై ఉండవద్దని కార్యకర్తలు కోరారు. గులాబీకి గుడ్ బై చెప్పి.. బయటకు రావాలని సూచించారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు లేఖ పంపించారు.
తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరించారని.. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీలో పరాయివాళ్లలా మారామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదని.. ఎన్నికల సమయంలోనే ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో ఆస్తులు పెంచుకోవటమే పరమావధిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా కంటక పాలన వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఏడాది కాలంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయలేదన్నారు. ప్రజల బాగోగుల కోసం పని చేసే అవకాశం లేని పార్టీలో ఉండటం కంటే.. బయటకు వెళ్లటమే మంచిదని రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్, అంజుమన్ తదితరులు శ్రీహరిరావు ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అంతా కలిసి పని చేసి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురేద్దామని కోరారు.
కూచాడి రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. 1995లో మామడ ఎంపీపీగా పనిచేసిన ఆయన.. 2001లో మామడ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కూడా పని చేశారు. 2007లో టీఆర్ఎస్ పార్టీలో చేరి.. పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేశారు. 2009, 2014లో రెండుసార్లు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. 2018లో మంత్రి అల్లోల గెలుపు కోసం పని చేశారు. ఆయన రాజీనామా పశ్చిమ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ అనే పలువురు చెబుతున్నారు.