మోసం… వేషం మార్చింది…
-ది వైన్ గ్రూప్ పేరుతో కోట్లాది రూపాయల మోసం
-ఆన్‌లైన్ మనీ మేకింగ్ పేరుతో తిరిగి మార్కెట్‌లోకి
-మళ్లీ మోసపోయేందుకు సిద్దమవుతున్న జనం
The Wine Group: ది వైన్ గ్రూప్ పేరుతో వందలాది మంది బాధితులను కోట్లలో మోసం చేసిన నిర్వాహకులు మరో రూపంలో ఇప్పుడు జనాన్ని మోసం రంగం సిద్ధం చేసుకున్నారు. వేరే యాప్ ద్వారా తిరిగి జనాల వద్ద డబ్బులు సేకరిస్తున్నారు. ప్రజలు సైతం మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, మోసపోయేందుకు సిద్దం అవుతున్నారు.
వైన్ బాటిల్ కొంటే చైన్ సిస్టం ద్వారా మీరు లక్షలు సంపాదించుకోవచ్చని ముందుకొచ్చిన ఓ కంపెనీ వినియోగదారులను నిండా ముంచింది. వందలాది మంది వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసిన కంపెనీ బిచాణా ఎత్తేసింది. ఒక వైన్‌బాటిల్ ఖరీదు చేయండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. కొందరిని జాయిన్ చేస్తే మీకు నెలనెలా జీతం కూడా ఇస్తామని చేసిన ప్రకటన నమ్మిన కొందరు అమాయకులు అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంస్థలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, చివరకు పోలీసులు సైతం ఈ వైన్ యాప్ బాధితులే.
మొదట ది వైన్ గ్రూప్ (TWG) పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తులు గ్రూపుల్లో లింక్‌లు పంపి వారిని ఆకర్షించారు. తాము ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. ముందుగా ఒక వైన్‌బాటిల్ కొనుగోలు చేయాలని, వైన్ బాటిల్‌తో మనం కొన్న డబ్బులు పెట్టుబడిగా పెట్టి వాటి ద్వారా వచ్చే డబ్బు వినియోగదారులకే ఇస్తామని చెప్పారు. ఒక వైన్ బాటిల్ కొంటే 60 రోజుల్లో మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని నమ్మబలికారు. 85 వేలు పెట్టుబడి పెడితే ప్రతిరోజు రూ. 1,2310 చొప్పున ఇచ్చారు. అలా 30 రోజుల్లో ఆరు లక్షల వరకు ఇస్తామని చెప్పి తర్వాత ఎగ్గొట్టారు. దీంతో ఈ యాప్ ద్వారా చాలా మంది కోట్లలో నష్టపోయారు. కొందరైతే తమకు రోజు డబ్బులు వస్తున్నాయని లక్షల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టారు.
ఆ యాప్ ముసివేయడంతో చాలా మంది బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.లక్షల్లో మోసపోయామని కొన్నిచోట్ల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నిర్వాహకులు ఇక్కడి వారు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన మేనేజర్ గోవాలో ఉంటానని వాట్సప్ గ్రూపులో చాటింగ్ చేస్తూ డబ్బులు సేకరిస్తోంది. కానీ, నిర్వాహకులు అసలు ఈ దేశానికి చెందిన వారే కాదని, యూకే నుంచి ఈ యాప్ నడుస్తుందని కొందరు బాధితులు చెబుతున్నారు. ఇక, ఆ మోసం అంతటితో ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, నిర్వాహకులు మాత్రం ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని తిరిగి పేరు మార్చుకుని మళ్లీ మార్కెట్‌లో అడుగుపెట్టారు.
ది వైన్ గ్రూప్ కాస్తా ఆన్‌లైన్ మనీ మేకింగ్ గ్రూపుగా నిర్వాహకులు మార్చేశారు. ప్రతి రోజు ఆదాయం వస్తుందని చూపెడుతున్నారు. ఒక వస్తువు కొంటే పరిమిత రోజుల్లో దానిని రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఉదాహరణకు ఒక వస్తువు రూ. 1000 పెట్టి కొంటే రోజు ఆదాయంతో 224 శాతం అదనంగా అంటే రూ. 2240 అందిస్తామని చెప్పారు. ఇక రూ. 85,000 వస్తువు కొంటే 40 రోజులు ప్రతి రోజు 7,650 రూపాయల చొప్పున మొత్తం రూ. 3,06,000 ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఇందులో కూడా చైన్ సిస్టం ద్వారా పలువురిని చేర్పిస్తే దానికి తగ్గ మొత్తం కూడా అందిస్తామని వెల్లడించారు నిర్వాహకులు.
ఈ ఆన్‌లైన్ మనీ మేకింగ్ యాప్‌లో సైతం ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. గతంలో ది వైన్ యాప్ పేరుతో మోసపోయిన వారు సైతం ఇందులో చేరుతుండటం గమనార్హం. అయితే, ఈ యాప్ కనీసం మూడు నెలల పాటు ఉంటుందని, గతంలో తాము పొగొట్టుకున్న సొమ్ము ఇందులో రాబట్టుకోవచ్చని వారి ఆలోచన. మూడు నెలల్లో సాధ్యమైనంత మేరకు బిజినెస్ చేసి లక్షలు సంపాదించుకుంటామని చెబుతున్నారు. మరి మధ్యలోనే ఈ యాప్‌ను మూసేస్తే ఎంటనే ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం లేదు. ఇలా నిత్యం ఆన్‌లైన్లో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. కానీ, ప్రజలకు మాత్రం కనువిప్పు కలగడం లేదు.