వచ్చే ఎన్నికల్లో సిర్పూరు నుంచి పోటీ చేస్తా
-బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం
-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
-బెజ్జూరు మండలంలో ర్యాలీ
Dr. RS Praveen Kumar: సిర్పూర్ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేయడానికి తాను సిద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొనేరు కోనప్ప ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలను ప్రశ్నిస్తే ఆదివాసీ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా బీఎస్పీ పని చేస్తుందన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంట్లో ఉన్న వృద్ధులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన విద్యా,వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తామన్నారు.
మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, రవాణా సౌకర్యం లేక ఎంతోమంది ఆదివాసీ గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివాసీ గూడేలకు రోడ్లు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనప్పను ఓడించాలని, బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఆయన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లను డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడించాలన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం వేలాది మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్రోళ్ల పాలనే కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు.వేలకోట్ల కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఆదివాసులకు పోడు భూముల పట్టాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆయన కేవలం ఎన్నికల ముందు ఆదివాసీ, గిరిజనుల నుండి దరఖాస్తులు తీసుకున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 3తో వేలాదిమంది గిరిజనులు ఆదివాసీలు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ చేసిన అన్యాయం గురించి తెలిసిపోయిందని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రవీణ్ కుమార్ మరోమారు పిలుపునిచ్చారు.