కాంగ్రెస్ లో స్థానికత చిచ్చు
-స్థానికులకే టిక్కెట్టు ఇవ్వాలని ప్రేంసాగర్ రావు వర్గం పట్టు
-అవసరమైతే రాజీనామాలకు సిద్ధమన్న నేతలు
-వినోద్‌ను ప్రోత్సహిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
-రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న వార్
Congress: కాంగ్రెస్ పార్టీలో అదే గ్రూప్ వార్ సాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య బహిరంగంగానే యుద్ధం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో ప్రేంసాగర్ రావు వర్గం కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, అదేవిధంగా స్థానికులకే టిక్కెట్టు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కొద్ది రోజులుగా ఇదే వాదాన్ని వినిపిస్తున్నారు. టిక్కెట్టు మాకంటే మాకు కావాలని ఇన్ని రోజులు గొడవలు పడ్డ నాయకులంతా ఏకతాటిపైకి రావడం గమనార్హం. వీరంతా నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ ఈ అంశంపై చర్చ సాగిస్తున్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవీ, నియోజకవర్గ ఇన్చార్జీ చిలుముల శంకర్ తదితరులు ఏకంగా విలేకరుల సమావేశం పెట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా బయటి వారికి ఇస్తే రాజీనామాలు చేయడానికి సైతం వెనకాడమని పలువురు నేతలు చెప్పుకొచ్చారు. స్థానికేతరులకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.
వినోద్‌ను అడ్డుకునేందుకే ప్రేంసాగర్ రావు ప్లాన్..
అయితే, ఇదంతా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వెనక ఉండి చేస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి వివేక్‌కు టిక్కెట్టు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో రకంగా ఆయనను ఇబ్బందులకు గురి చేయడం, ఆయన బెల్లంపల్లికి రాకుండా అడ్డుకోవడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసిన వినోద్ గెలుపు వాకిట వరకు వచ్చి ఆగిపోయారు. ఈసారి ఆయన తనకు ఖచ్చితంగా టిక్కెట్టు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన ప్రేంసాగర్ రావుతోనే తిరిగారు కూడా.. కానీ, ఏమైందో ఏమో ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. దీంతో ఇక్కడి టిక్కెట్టు ఎట్టి పరిస్థితుల్లో తన అనుచరులకే ఇచ్చుకోవాలనే ఆలోచనలతో ప్రేంసాగర్ రావు స్థానికత అంశం తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం సాగుతోంది.
వినోద్‌కు టీపీసీసీ చీఫ్ ఆశీస్సులు..
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి దూరంగా ఉంటారు. దీనిని అదనుగా భావించిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆయన పంచన చేరారు. శనివారం గాంధీభవన్‌లో కొందరు ఇతర పార్టీల కార్యకర్తలను తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వినోద్‌ను పొగడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఇలాంటి నేతల వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. తన అండదండలు వినోద్‌కు ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అదే సమయంలో వినోద్‌కు టిక్కెట్టు దక్కకుండా ఉండేందుకు ప్రత్యర్థి వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఓ వైపు స్థానికత అంశం, మరోవైపు టీపీసీసీ మద్దతు ఉన్న నేత ఇలా రెండు వర్గాలుగా ప్రస్తుతం కాంగ్రెస్ చీలిపోయింది. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కొద్ది రోజుల వరకైతే సస్పెన్స్.