మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ముప్పు
Telangana:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్కు పయనమైంది. ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.