ఏనుగు ఎక్కనున్న ఎమ్మెల్యేలు
BSP: వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్టు రాకపోతే…? అధినేత తమని పక్కన పెడితే..? ముఖ్యమంత్రి కొందరు సిట్టింగ్‌లను పక్కన పెడతారని వార్తలు నిజమైతే..? తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి…? ఇక్కడికే ఫుల్ స్టాప్ పడాల్సిందేనా..? ఇదీ చాలా మంది ఎమ్మెల్యేల మదిలో మెదులుతున్న ప్రశ్న.. ఆ ప్రశ్నకు సమాధానంగా కొందరు ఎమ్మెల్యేలు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో సైతం చాలా మంది ఆశావహులు ఉన్న నేపథ్యంలో వారి ఏకైక దిక్కుగా బీఎస్పీ కనిపిస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో హ్యట్రిక్ కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండు సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, వారి అవినీతి, వారిపై వచ్చే ఆరోపణలు ఇలా అధినేతను చికాకు చేస్తున్నాయి. ఈసారి కొందరు సిట్టింగ్‌లకు టిక్కెట్లు రాకపోవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు, టిక్కెట్లు ఆశిస్తున్న వారు వేరే పార్టీల వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలకు టిక్కెట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు నేతలపై ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అవినీతికి సంబంధించి సైతం కథనాలు వెలువడ్డాయి.
తమకు టిక్కెట్టు రాదని భావిస్తున్న నేతలు బీఎస్పీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాము ఆ పార్టీ జెండా పట్టుకుంటే ఖచ్చితంగా గెలుపు ఖాయమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిర్పూరు నుంచి కోనేరు కోనప్ప, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇద్దరూ బీఎస్పీ నుంచి విజయం సాధించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఇప్పుడు అదే బాట పట్టనున్నారు. ఈ మేరకు తూర్పు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే బీఎస్పీ అధినేత డాక్టర్. ప్రవీణ్‌కుమార్‌ను కలిసినట్లు సమాచారం. ఆయనతో మంతనాలు జరిపి తనకు టిక్కెట్టు కావాలని కోరినట్లు తెలుస్తోంది. దానిపై ప్రవీణ్ కుమార్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన ఆ పార్టీలోకి జంప్ కానున్నారు. ఇంకో ఎమ్మెల్యే సైతం ఆ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక పశ్చిమం నుంచి సైతం కొందరు ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే కాకుండా, కాంగ్రెస్, బీజేపీల నుంచి కొందరు ఆ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. అయితే, తమ పార్టీల్లో టిక్కెట్ల పంచాయతీ తేలినంకే అందులోకి వెళ్దామని సమయం కోసం వేచిచూస్తున్నారు. అదే సమయంలో ఆ పార్టీలో కర్చీఫ్ వేసుకునేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.