అధికారుల వాహన సేవలో అంబులెన్స్

సింగరేణి అంటేనే అధికారుల ఇష్టారాజ్యంగ మారింది. వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. యూనియన్ సంఘాల నేతలు సైతం వారికే వంత పాడుతుండటంతో ఎవరూ ఏం చేయలేని దుస్థితి. రోగులను తరలించాల్సిన అంబులెన్స్‌లో ఏకంగా ఓ అధికారి వాహనాన్ని తరలించడం చర్చనీయాంశంగా మారింది.. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏఎంసీ ఏరియాలో సింగరేణి అధికారికి చెందిన ఓ బైకు పాడయ్యింది. దీంతో ఇది బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ లో ఆ బైక్ మందమర్రికి తరలించారు. చెడిపోయిన బైక్‌ను ఇతర వాహనాల ద్వారా తరలించాల్సిన ఆ అధికారి అంబులెన్స్ ద్వారా తీసుకుపోడం పట్ల పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అధికారుల సేవలో తరించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగులను తరలించాల్సిన అంబులెన్స్ లో బైక్ తీసుకెళ్లడం చర్చనీయంశంగా మారింది. కార్మికుల ఆరోగ్య అవసరాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన అంబులెన్స్ కాస్తా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో బైక్‌లను మోసుకువెళ్తోంది. మరి అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారో..? లేదు ఎప్పటిలాగానే కండ్లున్న గుడ్డివాళ్లుగా నటిస్తారో..? చూడాల్సిందే.