అంగన్వాడీలో పైసల వసూళ్ల కలకలం
-వేసవి సెలవుల్లో సీడీపీవో డబ్బులు తీసుకున్నారని ప్రచారం
-వసూళ్లు చేసి ఇచ్చిన ఓ యూనియన్ నేతలు
-ఇలాంటి పనులు చేయకండంటూ యూనియన్ అధ్యక్షురాలి హితవు
Anganwadi : అంగన్వాడీ కేంద్రాల్లో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి అధికారులు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో జరిగిన వసూళ్ల పర్వం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారడంతో పాటు అంగన్వాడీల్లో జరుగుతున్న వసూళ్ల పర్వం బయటపెట్టింది.
మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అంటేనే అవినీతికి నిలయంగా మారింది. ఇక్కడ పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇవ్వాల్సిన సరుకులు మాయం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. అడిగే దిక్కు అంతకంటే లేదు. దీంతో అంగన్వాడీ టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కోటపల్లి మండలానికి చెందిన పాలు, గుడ్లు పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినా కేవలం ఓ వ్యక్తి మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ టీచర్ల మీద కనీసం చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ ఘటనలో కొందరు అధికారులు, నేతలు సైతం వారి మీద చర్యలు తీసుకోకుండా అడ్డుపడ్డారనే చర్చ సాగింది.
తాజాగా, మంచిర్యాల ప్రాజెక్టుకు సంబంధించి వసూళ్ల వ్యవహారం బయటికి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఆయాలకు 15 రోజులు, అంగన్వాడీ టీచర్లు 15 రోజులు ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే, చాలా చోట్ల ఆయాలు, అంగన్వాడీ టీచర్లు సెంటర్లు మొత్తానికే తెరవలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారిణి ఒకరు టీచర్లు, ఆయాలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక్కో టీచరు రూ.500, ఆయా రూ.500 చొప్పున ఇవ్వాలని, దానికి సంబంధించి కొందరు యూనియన్ లీడర్ల ద్వారా ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఆ పేరుతో దాదాపు రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
ఇందులో మరిన్ని ట్విస్టులు సైతం ఉన్నాయి. వసూళ్ల చేసిన వాటిల్లో యూనియన్ నేతలు కొందరు సగం డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ అధికారిణి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బందికి సైతం డబ్బులు ముట్టచెప్పినట్లు ప్రచారం సాగుతోంది. తనకు మిగిలింది కొంచం, బద్నాం మాత్రం పెద్ద ఎత్తున అయ్యానని ఆ అధికారిణి వాపోతున్నారు. వాస్తవానికి ఈ విషయం కూడా బయటకు రాకుండా ఆ అధికారిణి, అంగన్వాడీ యూనియన్‌కు సంబంధించిన నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే, ఎదుటి యూనియన్‌కు చెందిన వారు దీనిని వైరల్ చేయడంతో అది బయటక వచ్చింది.
విషయం బయటకు పొక్కడంతో వసూళ్ల పర్వానికి పాల్పడ్డ యూనియన్ నేత ఒకరు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు.. ఆ మెసేజ్ సారాంశం ఇదీ… హలో గ్రూపులో ఉన్న మంచిర్యాల్ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు అందరికీ నమస్కారం.. ఇది చేసిన వాళ్ళు ఎవరు దయచేసి ఇలాంటివి చేయకండి.. మన యూనియన్ కు చెడ్డపేరు తేకండి. మన యూనియన్ సభ్యత్వం తప్ప మిగతా ఏ డబ్బులు ఆశించదు. ఆఫీసర్ల కోసం మనం తపన పడాల్సిన అవసరం లేదు. వాళ్ల కోసం మనం ఉద్యోగం చేయడం ఎంత వరకు సమంజసం. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో అని మెసేజ్ చేశారు కాబట్టి నాకు కొంచమైనా గౌరవం దక్కింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టినప్పుడు చాలా బాధ అయింది. నాకు ఈ విషయాలు ఏమీ తెలవవు. నాకు ఎవరు చెప్పలేదు. ఇలాంటివి నేను అస్సలు సహించను. దయచేసి ఇకముందు ఇలాంటి పనులు చేయవద్దని మిమ్ములను కోరుకుంటున్నాను. ఇది చేసిన వాళ్ళు ఎవరో గాని ఇకముందు ఆఫీసర్లకు వసూలు చేసి ఇయ్యడం అనేది మానుకోండి. మన యూనియన్ కు మంచి పేరు ఉండాలి. కష్టపడి పని చేయాలి యూనియన్ సభ్యత్వం మాత్రమే తీసుకోవాలి. ఏదైనా మనం మీటింగ్ పెట్టుకోదలుచుకుంటే దానికి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. మన కోసం అది మన అంగన్వాడీ టీచర్ల కోసం, మన ఆయాల కోసం మనం చేసుకోవాలి గాని ఆఫీసర్ల కోసం మనము వసూలు చేసి ఇవ్వడం అనేది ఇది సమంజసమైన పని కాదు. అన్యధా భావించకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా…