నా సంపాదన చూసి పిల్లను కూడా ఇవ్వలేదు. ఓ బిలియ‌నీర్ విజ‌య‌గాథ

రూ.10వేల సంపాదన నుంచి బిలియనీర్‌ స్థాయికి ఎదిగిన వైనం - ఐపీఓ సందర్భంగా భావోద్వేగానికి గురైన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ

అనతికాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించడంతోపాటు డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న పేటీఎం.. తాజాగా భారత్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో (స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కావడం) స్థాయికి ఎదిగి యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం కొంతకాలంలోనే కోటీశ్వరుడిగా మారడమే కాకుండా వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న తీరు కూడా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తాజాగా బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో లిస్టింగ్‌ సందర్భంగా మాట్లాడిన పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ (43).. సంస్థ ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

పిల్లనిచ్చేందుకు వెనుకడుగు..
అంతకుముందు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత 27ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఓ సంస్థను స్థాపించి మొబైల్‌ కంటెంట్‌ను విక్రయించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో సంస్థ నుంచి వచ్చే ఆదాయం నెలకు కేవలం రూ.10వేలు మాత్రమే. విషయం తెలుసుకొని నాకు పిల్లను ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అలా నా కుటుంబానికి అర్హత లేని బ్యాచిలర్‌గా మారాను. దీంతో 2004-05లో కంపెనీ మూసేసి.. కనీసం రూ.30వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని చూసుకొమ్మని నాన్న చెప్పారు’’ అని విజయ్‌శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి రూ.18 వేల కోట్ల ఐపీవోతో భారత స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు విజయ్‌ శేఖర్‌.

వారికి నా సంపాదనే తెలియదు..

పేటీఎం తర్వాత నేను ఏం చేస్తున్నాననే విషయం చాలాకాలం పాటు నా తల్లిదండ్రులకే తెలియదు. ముఖ్యంగా నా సంపాదన ఎంతనే విషయంపైనా వారికి అవగాహన లేదు. నా సంపాదనపై ఓసారి వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి అమ్మ నన్ను అడిగింది. ‘విజయ్‌.. వాళ్లు చెబుతున్నంత డబ్బు నిజంగా నీ దగ్గరుందా..? అని తన తల్లి అడిగినట్లు విజయ్‌ శేఖర్‌శర్మ చెప్పుకొచ్చారు.

రోడ్డుపక్కన ‘టీ’ అంటేనే ఇష్టం..

ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన విజయ్‌శేఖర్‌ శర్మ తండ్రి ఉపాధ్యాయుడు కాగా తల్లి ఓ సాధారణ గృహిణి. 2005లో వివాహం చేసుకున్న శేఖర్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. అత్యంత సాదాసీదాగా ఉండే విజయ్‌శేఖర్‌.. రోడ్డుపక్కన ఉన్న బండిమీద ‘టీ’ తాగేందుకే ఇష్టపడుతారు. అంతేకాకుండా పాలు, బ్రెడ్‌ తీసుకునేందుకు ఉదయం పూట తానే స్వయంగా బయటకు వెళ్తానని విజయ్‌శేఖర్‌ పేర్కొనడం విశేషం.

స్వల్పకాలంలోనే రికార్డు స్థాయికి..

ఇక వ‌న్ 97 కమ్యూనికేషన్‌ (పేటీఎం మాతృసంస్థ) పేరుతో 2000 సంవత్సరంలో ఓ కంపెనీ స్థాపించారు. తొలుత టెలికాం ఆపరేటర్లకు కంటెంట్‌ను అందించే సంస్థగా ఉన్న వన్ 97.. 2010లో పేటీఎంగా మారింది. అనంతరం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. 2014లో వాలెట్‌ పేమెంట్స్‌ లైసెన్స్‌ పొందింది. 2015లో చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ పేటీఎంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం సంస్థ గతిని మార్చేసింది. పేటీఏం అనతికాలంలోనే దేశం నలుమూలలా విస్తరించింది. వీటికితోడు 2016లో కేంద్రప్రభుత్వం కరెన్సీ రద్దు చేయడం.. డిజిటల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరగడం సంస్థకు కలిసొచ్చింది. ఇలా అనతికాలంలోనే (2017 ఏడాదిలో) యువ బిలియనీర్స్‌ జాబితాలో విజయ్‌శేఖర్‌ స్థానం సంపాదించుకున్నారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.18వేల కోట్లు (2.4 బిలియన్‌ డాలర్లు). వ్యాపారంలో ఎటువంటి కుటుంబ నేపథ్యం, భారీ నగదు, ఆంగ్లభాషపై పట్టు లేనప్పటికీ ఓ బిలియనీర్‌ స్థాయికి ఎదిగిన విజయ్‌శేఖర్‌ ప్రస్థానాన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like