పులి నుంచి రక్షణ చర్యలు.. ప్రజల కోసం మాస్కులు..
Tiger: ఇవేంటి కొత్తగా మాస్కలు.. అది కూడా తల వెనక్కి పెట్టుకుని తిరుగుతున్నారని అనుకుంటున్నారా…? దీని వెనక పెద్ద కథే ఉందండి… కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి తిరుగుతోంది. అది ఒక మహిళా కూలీని చంపడమే కాకుండా, మరో రైతు పై దాడి కూడా చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి నుంచి రక్షణ కోసం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిపిస్తున్నారు. అదే సమయంలో వారికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఆ మాస్కులు తల వెనక భాగంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
పులి ఎదురుగా దాడి చేయదు.. వెనక వైపే దాడి చేస్తుంది. పనులు చేసుకునే సమయంలో, పత్తి ఏరుతున్న సమయంలో పులి వెనక భాగంలో దాడి చేస్తోంది. మాస్క్ పెట్టుకుంటే మనిషి మనవైపు చూస్తున్నారని పులి దాడి చేయడానికి వెనకడుగు వేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదీ ఈ మస్కుల పంపిణీ ముచ్చట.
పులి సంచారం నేపథ్యంలో అధికారులు ప్రజల కోసం పలు సూచనలు చేస్తున్నారు..
-గ్రామస్తులు అటవీ ప్రాంతాల గుండా వెళ్లే మార్గాలను ఉపయోగించకూడదు.
-అటవీ రహదారుల వెంబడి అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్ గేట్లను అభ్యంతరం చెప్పకూడదు.
-కనీసం 8 నుండి 10 మంది వ్యవసాయ క్షేత్రాలకు పంట కోత, ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు వెళ్లాలి. ఆ సమూహంలో (2) వ్యక్తులను తప్పనిసరిగా సెంట్రీగా నియమించాలి. వారు డప్పు చప్పుడు, విజిల్ ద్వారా చప్పుడు చేస్తూ వుండాలి.
-రైతు తన పంటను కాపాడుకుంటూ వ్యవసాయ పొలంలో మంచె పైనే ఉండాలి.
-గొర్రెల కాపరులు గుంపులుగా వెల్లాలి. పశువులను మేత కోసం అడవిలోకి గ్రామం నుండి 2 కి.మీ మించి తీసుకెళ్లకూడదు.
-గొర్రెల కాపరులు ఉదయం 10 గంటల తర్వాత మేతకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి రావాలి.
-పొలానికి వెళ్లే ప్రతి గ్రామస్తునికి రక్షణ కర్రతో పాటు చిన్న గంట కట్టి ఉండాలి.
-పొలంలో పనిచేసే వ్యక్తులు, గొర్రెల కాపరులు కూడా తల వెనుక భాగంలో ఫేస్ మాస్క్ ధరించాలి.
-సర్పంచ్ చైర్ పర్సన్ గా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కన్వీనర్ గా గ్రామ రక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ నామినేట్ చేసిన ఒక పోలీసు.
-పులి సంచారం, అడుగులు వంటి ఏవైనా ఆధారాలు కనిపిస్తే, వారు వెంటనే గ్రామ రక్షణ కమిటీకి, అటవీ అధికారులకు కూడా తెలియజేయాలి.
-రక్షణ కమిటీ గ్రామంలోని సమూహాలకు సరిపడే ఈలలు, డ్రమ్ములను కొనుగోలు చేయాలి.
-ప్రతిరోజు ఉదయం గ్రామస్థులు గ్రామ రక్షణ కమిటీకి తాము వెళ్తున్న క్షేత్రం, వెళ్తున్న వారి సంఖ్య, ఆ గుంపుకు పంపిన సమాచారం గురించి సమాచారం ఇవ్వాలి.
-ఏ గ్రామస్థుడు కూడా పులికి హాని చేయకూడదు.
-వారు ఎలాంటి ఉచ్చులు, వలలు, విద్యుత్ వైర్లు మొదలైన వాటిని వేయకూడదు.