కళ్లకు గంతలు కట్టి… పెన్ను క్యాప్ మింగించి…

చదువుల తల్లికి నిలయాలుగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా, కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన అమానుషం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం దహేగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉషాన్ శృతి అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన కొందరు తోటి విద్యార్థినులు శృతిపై ర్యాగింగ్‌ పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కిరాతకంగా ప్రవర్తించారు. బాధిత విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు కదలకుండా గట్టిగా బిగించి పట్టుకున్నారు. అనంతరం నోట్లో పెన్ క్యాప్ వేసి, అది లోపలికి వెళ్లేలా బలవంతంగా నీళ్లు పోసి మింగించారు.

స్కానింగ్‌లో బయటపడ్డ పెన్ క్యాప్
ఆ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్పందించిన యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయగా, బాలిక కడుపులో పెన్ క్యాప్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అత్యవసరంగా చికిత్స అందించిన వైద్యులు.. శృతి కడుపులో ఉన్న పెన్ క్యాప్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోంది.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
పాఠశాలలో జరిగిన ర్యాగింగ్ ఉదంతంపై బాధిత విద్యార్థిని తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ అమానుష ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like