వేములవాడలో భక్తుల రద్దీ : 87 వేల మందికి పైగా దర్శనం
పవిత్ర శ్రావణ సోమవారం కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు, అభిషేకాలు, ఆకు పూజలు, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజలు వంటి వివిధ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సుమారు 87,540 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ గణపతికి అధర్వశీర్ష పారాయణంతో మహాభిషేకం చేపట్టారు.