ఫిర్యాదుదారులపైనే కేసులా?
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫైర్
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో కాంగ్రెస్ నాయకుల ప్రజాధనం దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చని అధికారులే సూచించారని.. వారి సూచన మేరకే తమ నాయకులు ఫిర్యాదు చేశారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టలేదని అన్నారు.
రైస్ మిల్లులో రూ.4.36 కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని దుర్గం చిన్నయ్య దుయ్యబట్టారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ఒక్కరే దోచుకోలేదని, ఎమ్మెల్యే, అధికారులకు కూడా వాటాలు ఇచ్చామని కొందరు బహిరంగంగా చెబుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్కు వాటా ఉందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే తమ నాయకులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, అయినా కులం పేరుతో దూషించారంటూ కేసులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు కృష్ణస్వామిపై కొందరు దాడి చేశారని, దాడి చేసిన వారిపై మాత్రం ఎందుకు కేసులు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. రూ.4.36 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని దుర్గం చిన్నయ్య హెచ్చరించారు.