ఏ బిడ్డా ఆక‌లితో బ‌డికి వెళ్లొద్దు

ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదని… అదే త‌మ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆయ‌న మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సానబెట్టిన వజ్రాల్లా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్ది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే త‌మ‌ లక్ష్యమ‌న్నారు. ఇంత మంచి కార్యక్రమం మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి మంచిర్యాల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం అభినందనీయమ‌న్నారు.

ఈ కార్యక్రమంలో క‌లెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, DCP భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

You might also like