మ‌హారాష్ట్రలో రోడ్డు ప్ర‌మాదం.. తెలంగాణ‌లో విషాదం

మ‌రో ప‌దిహేను నిమిషాల్లో ఇంటికి చేరేవారు… ఇంత‌లోనే విధి వారిని వెంటాడింది… శివ‌య్య ద‌ర్శ‌నానికి అని వెళ్లిన వారిని మృత్యువు క‌బ‌లించింది. జీపు టైరు పేలడంతో న‌లుగురు మృత్యువాత ప‌డ‌గా.. ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి..

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందగ మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ సరిహద్దు పక్కనే మహారాష్ట్ర లో ఈ ప్రమాదం జరిగింది. మరో పది పదిహేను నిమిషాలు అయితే అందరూ తమ ఇండ్ల లోకి చేరుకునే వారు ఈ లోపే మృత్యువు కబళించింది.

మహారాష్ట్ర తొటాంబ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన పలువురు ఈ రోజు శ్రావణ సోమవారం సందర్భంగా మహారాష్ట్రలోని కైలాస్ టేక్డి దేవాలయ దర్శనం చేసుకున్నారు. తర్వాత ఇస్లాపూర్ వద్ద సాసర్ కుండ్ లో స్నానాలు చేసి తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని తొట్టంబ తాండ వద్ద జీపు టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మార్గమధ్యలో మరణించారు.

ఇదే ఘ‌ట‌న‌లో మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ఆవుల గంగాధర్, తూమ్ సాయిలు, తూమ్ చంద్ర భాయ్, జీపు డ్రైవర్ ఆరే తులసి రామ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలించేలోపు మరొకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పదిహేను నిమిషాలు అయితే అందరూ తమ ఇంటికి చేరుకునేవారు. ఈ లోపు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

You might also like