కత్తిపోట్లకు లొంగని ధైర్యం.. “భారత్ పైలట్ సాహసానికి ప్రపంచం సెల్యూట్!”

వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గాల్లో గింగిరాలు తిరుగుతూ క్షణాల వ్యవధిలోనే వేల అడుగులు కిందకు దూసుకుపోయింది. కాక్‌పిట్‌లో తనపైనే కత్తితో దాడి చేస్తూ, విమానాన్ని నేలకేసి కూల్చివేయడానికి యత్నిస్తున్న సహ పైలట్‌తో ప్రాణాలకు తెగించి పోరాడాడు ఓ భారతీయ కెప్టెన్. శరీరం రక్తసిక్తమైనా, తీవ్ర గాయాలతో ఉన్నా ఏమాత్రం బెదరకుండా కాక్‌పిట్ తలుపులు తెరిచి, ప్రయాణికులు-సిబ్బంది సాయంతో విమానాన్ని సురక్షితంగా నేలకు దించి దాదాపు 180 మంది ప్రాణాలను కాపాడారు.

ఆధునిక విమానయాన చరిత్రలోనే అత్యంత ధైర్యసాహసోపేతమైన ఈ ఘటన ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో చోటుచేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం (Flight FZ1073-బోయింగ్ 737) లో దాదాపు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం జోర్డాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో, కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ అకస్మాత్తుగా తీవ్ర ఉగ్ర ఆలోచనలతో వికృత చేష్టలకు దిగాడు. విమానాన్ని కూల్చివేసి సామూహిక మారణహోమానికి పాల్పడే ఉద్దేశంతో, పక్కనే ఉన్న ప్రధాన పైలట్, భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

కో-పైలట్ నియంత్రణ వ్యవస్థలను లాగేసి విమానాన్ని బలవంతంగా కిందికి నెట్టడంతో, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలోనే విమానం ఏకంగా 14,000 అడుగుల మేర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. క్యాబిన్‌లో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. విమానం కూలిపోవడం ఖాయమని అందరూ భావించిన క్లిష్ట సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. తీవ్రమైన కత్తిపోట్లతో రక్తం కారుతున్నా, ఉన్మాదిగా మారిన కో-పైలట్‌ను భౌతికంగా అడ్డుకున్నారు.

తీవ్ర గాయాల పాలైన కెప్టెన్ స్మిత్ సంయమనం కోల్పోలేదు. ఎలాగోలా కాక్‌పిట్ భద్రతా తలుపును అన్‌లాక్ చేయడంలో విజయం సాధించారు. రక్తం మరకలు, పెనుగులాటను గమనించిన ముందు వరుసలోని ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌‌లోకి దూసుకొచ్చారు. కంట్రోల్స్ వద్ద ఉన్న కో పైలెట్‌ను పట్టుకుని బంధించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు, సిబ్బంది సహకారంతో విమానాన్ని అదుపులోకి తీసుకొచ్చారు.

విమానం ప్రమాదం నుంచి బయటపడగానే అత్యవసర సంకేతాలు పంపి, సమీపంలోని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడగా, తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స అందించారు. దాడికి పాల్పడిన కో-పైలట్‌ను సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

గుజరాత్ మూలాలు కలిగిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు విమానయాన రంగంలో 13 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. బోయింగ్ 737 విమానాలను నడపడంలో 9,750 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. గతంలో సుమారు 11 ఏళ్లపాటు భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో సీనియర్ కమాండర్‌‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా సేవలు అందించారు. జూన్ 2022లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్‌లో చేరారు. ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, తీవ్ర సంక్షోభ సమయంలోనూ చూపిన ఉక్కు సంకల్పమే ఈ ఘోర ప్రమాదాన్ని నివారించాయి.

ఈ ఘటనపై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కత్తిపోట్లకు గురైనా చివరి క్షణం వరకు పోరాడి 180 మంది అమాయకుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ నిజమైన హీరో అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొనియాడారు. మరో 9/11 తరహా ఘోర విషాదం జరగకుండా సమయస్ఫూర్తితో దేశ ప్రతిష్టను నిలబెట్టిన భారత కెప్టెన్ సాహసాన్ని యావత్ ప్రపంచ విమానయాన రంగం ముక్తకంఠంతో ప్రశంసిస్తోంది.

You might also like