ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం… పెద్ద‌ప‌ల్లి బిడ్డ చికితారావు భాగ‌స్వామ్యం

ఆసియా క్రీడలు-2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు అదరగొట్టింది. ఈ విజయంతో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన చికితా రావు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన చికితా రావు, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్‌తో కూడిన భారత త్రయం బుధవారం జరిగిన ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్​ ఖాతాలో ఏడో స్వర్ణం చేరింది. ఈ స్కోర్​తో భారత మహిళల ఆర్చరీ జట్టు ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది.

తెలంగాణ‌లోని పెద్ద‌ప‌ల్లికి చెందిన చికితా రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం, మ‌హారాష్ట్రకు చెందిన‌ ప్రీతికా ప్రదీప్‌తో కూడిన భారత జట్టు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ఫైనల్లో ఒత్తిడి అధిగమిస్తూ ప్రతి రౌండ్‌లోనూ చైనాపై ఆధిక్యాన్ని కొనసాగించి నెగ్గింది. ఇక ఫైనల్లో 238 పాయింట్లు సాధించడం ద్వారా భారత జట్టు ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ రికార్డు గతంలో దక్షిణ కొరియా పేరిట ఉంది. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కొరియా మహిళల కాంపౌండ్ జట్టు 238 పాయింట్ల స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు అదే స్కోరును భారత జట్టు సాధించడంతో ప్రపంచ రికార్డు సమమైంది.

ఫైనల్ పోరు ప్రారంభమైన వెంటనే భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చింది. తొలి ఎండ్‌లో వరుసగా పర్ఫెక్ట్ 10లు సాధిస్తూ 60- 58తో ఆధిక్యం సంపాదించింది. రెండో ఎండ్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. మరోసారి 60 పాయింట్లు సాధించిన భారత జట్టు 60- 58తో ఆ రౌండ్‌ను సొంతం చేసుకుంది. మూడో ఎండ్ ముగిసే సమయానికి భారత్ 178- 176తో ముందంజలో నిలిచింది. చివరి ఎండ్‌లో టైటిల్‌ను ఖరారు చేసుకోవడానికి భారత్‌కు మరో స్థిరమైన ప్రదర్శన అవసరమైంది. చివరి రౌండ్‌లో భారత త్రయం మొత్తం ఆరు పర్ఫెక్ట్ 10లు సాధించింది. దీంతో 238 పాయింట్లతో ఫైనల్‌ను ముగించి 234 పాయింట్లకే చైనాను పరిమితం చేసింది. ఫలితంగా భారత్‌కు స్వర్ణం ఖాయమైంది.

పెద్దపల్లికి గర్వకారణంగా చికితా
భారత స్వర్ణ విజయంలో తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన చికితా రావు భాగస్వామి కావడం తెలంగాణ క్రీడాభిమానులకు ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది. జ్యోతి సురేఖ, చికితా రావు, ప్రీతిక ప్రదీప్‌ల సమిష్టి ప్రదర్శనతో భారత్‌ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఆసియా క్రీడలు-2026లో ఆర్చరీ ద్వారా భారత్‌ ఖాతాలో ఏడో స్వర్ణం చేరింది. ఈ విజయంతో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 53కు చేరింది. ఇందులో 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలు ఉన్నాయి.

 

You might also like