ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక… వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే నివాసానికి…
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందలేదని తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఏకంగా ఎమ్మెల్యే నివాసానికి తీసుకువెళ్ళాడు కొడుకు… కలకలం రేపిన ఈ ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి…
పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా బుజ్జి (55) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని, తల్లి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా చికిత్స అందించలేదని రాజ్‌కుమార్ ఆరోపించాడు. బెడ్ ఇవ్వాలని కోరినా స్పందించలేదని, ఆసుపత్రి సిబ్బంది తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో తల్లిని అదే వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆసుపత్రి నుంచి కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి రాత్రివేళ వెళ్లాడు. అయితే ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ ఉన్న సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీధర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తల్లీకొడుకులను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.