“రక్తదానం ఓ ఉద్యమం.. ఎడ్ల కిషన్‌ ఓ స్ఫూర్తి!”

అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు, అనుకోని ప్రమాదాలు కారణమేదైనా ప్రతీ రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతోంది. రోజు రోజుకి రక్తం దొరక్క చనిపోయేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి రక్తదానం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా చాలామంది రక్తం దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ మంచిర్యాల వాసి ఎడ్ల కిష‌న్ ఉద్యమంలా రక్తదానం చేస్తున్నారు. తనతో పాటు చుట్టూ ఉన్న వారిలోనూ చైతన్యం కలిగిస్తున్నారు.

ఎందరో బాధితులకు అండగా: సహజంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో నాలుగైదు సార్లు రక్తదానం చేస్తుంటాడు. ప్రాణాల్ని నిలిపే రక్తం విలువ తెలిసిన వాళ్లు రెండు, మూడేళ్లకు ఒకసారి, అవసరాన్ని బట్టి రక్తదానం చేయడానికి మందుకొస్తారు. కొంత మంది లేనిపోని అనుమానాలు, అపోహలతో ఆపదలో ఉన్నవారికి రక్తం ఇచ్చేందుకు ససేమిరా అంటూ ఉంటారు. కానీ మంచిర్యాల‌కు చెందిన ఎడ్ల కిష‌న్ మాత్రం ఇప్ప‌టికి 21సార్లు రక్తదానం చేశారు. ఎందరో బాధితులకు అండగా నిలిచారు. ఆయన నిస్వార్థ సేవలకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి.

ఉత్తమ రక్తదాత పురస్కారం : ల‌య‌న్స్ క్ల‌బ్‌, రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వ‌ర్యంలో పుర‌స్కారాలు వ‌చ్చాయి. తాను ర‌క్తం ఇవ్వ‌డ‌మే కాకుండా, ఇత‌రుల‌తో కూడా ర‌క్తం ఇప్పించినందుకు సైతం ఆయ‌న‌ను అవార్డులు వ‌రించాయి. 26 ఏండ్లుగా ఆయ‌న ర‌క్త‌దానం చేస్తూనే ఉన్నారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా సైతం అవార్డు అందుకున్నారు. 2010 నుంచి బ్ల‌డ్ బ్యాంక్ ఏర్పాటు కావ‌డంతో ఇక్క‌డ ర‌క్తం ఇస్తున్నారు. మెడిక‌ల్ అసోసియేష‌న్ స‌భ్యుడిగా ప‌నిచేస్తూ అంత‌కుముందు ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. వృద్ధాశ్ర‌మానికి సంబంధించి 2018లో ఆయ‌న క‌మిటీ స‌భ్యుడిగా సైతం సేవ‌లు అందిస్తున్నారు.

ర‌క్త‌దానం చేయ‌మంటే ఖ‌చ్చితంగా మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేయ‌డ‌మే అని న‌మ్ముతారు కిష‌న్‌… రక్తదానం ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని దాన్ని కొనసాగిస్తున్నాను. నేను నమ్మిన ఒకటే సిద్ధాంతం ఏంటంటే ” నువ్వు సమాజాన్ని కాపాడితే, సమాజం నిన్ను కాపాడుతుంది. నువ్వు సమాజాన్ని వదిలేస్తే, సమాజం నిన్ను వదిలేస్తుంది ” రక్తదానం చేస్తే బలహీన పడతాం, నీరస పడిపోతాం అనేది అపోహ మాత్రమే వారం రోజుల్లో మనం ఇచ్చిన రక్తం భర్తీ అయిపోతుంది. నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా రక్తదానం కోసం అడిగితే వారికి బ్లడ్​ డొనెట్​ చేస్తానని ర‌క్త‌దాత కిష‌న్ వెల్ల‌డించారు.

వైద్యుల సూచనలు : రక్తదానం చేసిన 48 గంటల్లో శరీరం కొత్త రక్తాన్ని తయారు చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల శరీరం చురుగ్గా మారుతుంది. ఒకసారి రక్తదానం చేయడం వల్ల శరీరంలో దాదాపు 650 కేలరీలు ఖర్చవుతాయి. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. కనీసం 45 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. హిమోగ్లోబిన్ శాతం 12.5 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. ప్రతి 3 నెలలకు లేదా 4 నెలలకు ఒకసారి సురక్షితంగా రక్తదానం చేయవచ్చు.

 

You might also like