విచారణ జరిగింది.. ఆధారాలు ఇచ్చారు.. చర్యలేవి మ‌రి..?

తాండూరు మండలంలో గతంలో ఎంపీఓగా పనిచేసిన అధికారిపై వచ్చిన ఆరోపణలు… అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళా పంచాయతీ కార్యదర్శులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, కొంద‌రు ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు, వ్యక్తిగత అవసరాలకు ఉద్యోగులతో ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు చెల్లింపులు చేయించుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే ఫిర్యాదులు, దానిపై విచారణ పూర్తయి దాదాపు నెల‌న్న‌ర గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఆధారాలతో విచారణ
తాండూరు మండలంలో పనిచేస్తున్న పలువురు మహిళా పంచాయతీ కార్యదర్శులు గతంలో ఎంపీఓగా పనిచేసిన అధికారిపై ఆగస్టు 3న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 18న విచారణ అధికారి డీఎల్పీఓ సతీష్ తాండూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను విచారణ అధికారికి అందించారు. తమ నుంచి ఎంపీఓ వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్‌పే, గూగుల్‌పే చేయించుకున్న స్క్రీన్‌షాట్లను కూడా సమర్పించారు. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంభాషణలకు సంబంధించిన వివరాలను సైతం అధికారులకు అందించారు.

నెల రోజులు దాటినా.. చర్యలు శూన్యం
విచారణ పూర్తయి నెల రోజులు దాటుతున్నా సదరు అధికారిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం లక్షెట్టిపేట మండలానికి డిప్యూటేషన్‌పై పంపడంతోనే అధికారులు వ్యవహారాన్ని ముగించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేయడం, విచారణ సందర్భంగా ఆధారాలను అధికారులకు అందించడం జరిగినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు
సదరు అధికారిపై చర్యలు తీసుకోకుండా పశ్చిమ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఎంపీవో ఆ నేత‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌డంతో త‌నపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేందుకు వారు ఒత్తిడి తెస్తున్న‌ట్లు స‌మాచారం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

‘మళ్లీ నేనే వస్తా’.. ఉద్యోగుల్లో ఆందోళన
ఇదిలా ఉండగా, సదరు ఎంపీఓ తిరిగి తాండూరు మండలానికి వస్తానని, అప్పుడు అందరూ తన కిందే పనిచేయాల్సి ఉంటుందని కొందరు ఉద్యోగులను హెచ్చరిస్తున్నట్లు స‌మాచారం. దీంతో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనపై ఫిర్యాదులు, విచారణ జరిగిన నేపథ్యంలో సదరు అధికారి తిరిగి అదే ప్రాంతానికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

చర్యలు ఎప్పుడూ?
మహిళా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించి, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు తదుపరి చర్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ, తాత్సారం చేయ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉంటారా..? లేకుంటే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన అధికారిపై వేటు వేస్తారా..? వేచి చూడాల్సిందే మ‌రి…

You might also like