అలసత్వం ప్రదర్శిస్తే క‌ఠిన చర్యలు

మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్ప‌ష్టం చేశారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ, భరోసా కేంద్రాల సేవలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై ఆధారాలను సేకరించి, అవసరమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు,సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శ–చెడు స్పర్శ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించాల‌న్నారు. అదే విధంగా కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస, సంక్షేమ సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్, రక్షణ, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. షీ టీమ్స్ సిబ్బంది బాధితుల గోప్యతను కాపాడాలని కమిషనర్ సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా అవగాహన కల్పించాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్,మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ,షీ టీమ్ ఎస్‌ఐలు హైమా,ఉషారాణి, లావణ్య,షీ టీమ్ సిబ్బంది, భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.

You might also like