ఈ నెల 14న ‘సింగరేణి కార్మిక గర్జన’
ఈ నెల 14న రామగుండంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే సింగరేణి కార్మిక గర్జన ఏర్పాటు చేశామన్నారు. ఈ సభలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని…. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి అధికారులు కూడా రోడ్డుమీదికొచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. కార్మికులకు రావాల్సిన వాటా.. లాభాలను డిక్లేర్ చేయాలని లాభాల్లో పూర్తి వాటను కార్మికులకు అందించాలని తమ మొదటి ప్రధానమైన డిమాండ్ అని స్పష్టం చేశారు.
కార్మికులకు ఇంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ 2019లో జీవో 76 తెచ్చారని…. కానీ తామే జీవో ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంతంలో 30 వేల మంది కార్మికులకు హక్కులు కల్పించి, వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ జీవోను పక్కనపెట్టి నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ఒక్క మంచిర్యాలలోనే వేలాది స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. మూడేళ్లపాటు కార్మికుల ఉసురు పోసుకున్నందుకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 76 కింద మిగిలిన కార్మికులకు సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.