బతుకమ్మ కానుకగా రూ.2500, రెండు తులాల బంగారం తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందంటే

బ‌తుక‌మ్మ పండుగ(Bathukamma Festival) సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం(Government of Telangana) మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ పథకం కింద రెండు తులాల బంగారం అందించ‌నుందా..? ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారా..? దీనిని ఏకంగా ముఖ్య‌మంత్రే వీడియోలో వెల్ల‌డించారా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నిజ‌మనే అనిపిస్తుంది..?

తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి షురూ అయింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగ సంద‌ర్భంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ పథకం కింద రెండు తులాల బంగారం అందించ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి చెప్పిన‌ట్లుగా ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో మార్ఫింగ్ చేసిందని తెలిపింది. ఈ వీడియోలను నమ్మవద్దని, సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వం విడుదలచేసే వేదికల నుంచే తెలుసుకోవాలని సూచించింది.

తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వివరాల ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని ప్రకటించినట్లు ప్రచారం అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో. ఈ వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించినవి. అసలు వీడియోకుఉన్న ఆడియోను మార్చి, దాని స్థానంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేశారు. దీని ద్వారా, ముఖ్యమంత్రి రెండు పథకాల అమలును ప్రకటించినట్లు కనిపించేలా చేశారు.

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విషయాలకోసం, కేవలం అధికారిక ప్రభుత్వ మాధ్యమాల ద్వారా విడుదలైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్ల‌డించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న ఏఐ వీడియోలు, ఆడియోలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్‌లో పేర్కొంది.

You might also like