మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో వర్షాలు..
Murasu Cyclone: తీవ్ర తుపానుగా బలపడిన మురసు.. తీరం వైపు దూసుకువస్తోంది.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఏపీవైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ఇవాళ అర్ధరాత్రి లేదంటే మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తుపాను తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 120 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సహాయక చర్యల కోసం ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
మురసు తుపాన్ మంగళవారం తెల్లవారుజాము సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సెలవు ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నెల్లూరు ఎన్డీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
తెలంగాణలోని పలు జిల్లాలో సోమ, మంగళ, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధ, గురువారాల్లో మధ్య తెలంగాణ జిల్లాల వరకు ఈ తుపాను ప్రయణించి బలహీన పడుతుందని, గురువారం వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ (సోమవారం) ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామలలో భారీవర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు (మంగళవారం) ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు. బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.