రైతులకు కేంద్రం భరోసా
“అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. అంతర్జాతీయంగా ముడి పదార్థాలు, రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. దేశంలోని రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడనివ్వబోమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. యూరియా, డీఏపీ ఎరువులను సరసమైన ధరలకే అందిస్తామని భరోసా ఇచ్చారు”.
దేశంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా, ధరల పెరుగుదల ప్రభావం వారిపై పడకుండా కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. నవంబర్ 26 నుంచి 28 వరకు జరిగిన ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FAI) వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. 26 దేశాల నుంచి 1,800 మందికి పైగా ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో ‘సుస్థిర వ్యవసాయం కోసం ఎరువుల భవిష్యత్తును సురక్షితం చేయడం’ అనే అంశంపై చర్చించారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. ముడి పదార్థాలు, ఇంధనం, సరుకు రవాణా, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ, పరిశ్రమల సమన్వయంతో దేశంలో ఎరువుల కొరత రాకుండా కట్టడి చేశామన్నారు. ఈ సంక్షోభ సమయంలో సరఫరాను ఎలా కొనసాగించామో ఒక కేస్ స్టడీగా ప్రజలకు వివరించాలని పరిశ్రమ వర్గాలకు నడ్డా సూచించారు.
ప్రపంచ మార్కెట్లో ధరలు మండిపోతున్నా.. యూరియా, డీఏపీ సహా కీలక పోషకాల రిటైల్ ధరలను ప్రభుత్వం పూర్తిగా నియంత్రించిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ అదనపు భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగానికి ఫాస్ఫాటిక్, పొటాసిక్ ఎరువుల సబ్సిడీ కోసం రూ. 62,000 కోట్లకు పైగా కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
12 ఏళ్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. దేశీయంగా ఏటా సుమారు 4 కోట్ల టన్నుల యూరియా డిమాండ్ ఉండగా, గత ఏడాది కోటి టన్నుల వరకు దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఈ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గతంలో మూతపడిన 6 యూరియా ప్లాంట్లను తెరిపించామని.. మరో 6 బ్రౌన్ఫీల్డ్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 54,000 కోట్ల పెట్టుబడితో ఆమోదం తెలిపామని జేపీ నడ్డా వివరించారు.