మావోయిస్టులకు ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ఉనికిని తిరిగి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టుల పన్నాగాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కాంకేర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో భారీ రివార్డు ఉన్న కీలక నేత సహా ఐదుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా మెండ్రా ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. విశ్వసనీయ సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన బలగాలు.. ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు వీరు రహస్యంగా ప్రయత్నిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

అరెస్టయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) చందర్ కత్లామ్ ఉండటం గమనార్హం. ఇతనిపై ప్రభుత్వం 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. చందర్ కత్లామ్‌తో పాటు పడ్డా కాకనార్ కమిటీ సభ్యుడు మంగ్లూ, మహిళా మావోయిస్టులు మనీషా, రమ్హీలా పోలీసులకు చిక్కారు. అయితే, పోలీసుల దాడి సమయంలో మరో మావోయిస్టు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతని కోసం భద్రతా బలగాలు పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పట్టుబడిన ఐదుగురు మావోయిస్టులను తదుపరి విచారణ కోసం గోండాహూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కీలక నేతల అరెస్టుతో బస్తర్ రీజియన్‌లో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలినట్లయిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

You might also like