శ‌భాష్‌… ష‌ర్పుద్దీన్‌

పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతలను కాపాడేవారే కాదు.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే మానవతామూర్తులు కూడా అని మరోసారి నిరూపితమైంది. నల్గొండ జిల్లాలో ఓ పోలీస్ సిబ్బంది చేసిన పని ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది. తన భవిష్యత్తు కోసం ఎస్ఐ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ తల్లికి తోడుగా నిలిచి, ఆమె చిన్నారిని కంటికి రెప్పలా చూసుకున్న ఆ ఖాకీ కథేంటో ఇప్పుడు చూద్దాం.

నల్గొండ జిల్లాలో జరిగిన ఎస్ఐ పరీక్షా కేంద్రం వద్ద ఒక అద్భుతమైన మానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి చదివి, ఎస్ఐ కావాలనే కలతో ఓ మహిళ తన పసిబిడ్డను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది. అయితే, ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. పరీక్షా కేంద్రంలోకి చిన్నారిని అనుమతించరు.. బయట బిడ్డను ఎవరి దగ్గర వదిలి వెళ్లాలో తెలియక ఆ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. ఎంతో కీలకమైన పరీక్షను వదులుకోవాల్సి వస్తుందేమోనని సతమతమవుతున్న ఆ తల్లి నిస్సహాయత అక్కడే విధుల్లో ఉన్న డిండి మండల పోలీస్ సిబ్బంది షర్పుద్దీన్ గమనించారు.

వెంటనే స్పందించిన ఆయన.. ఏమాత్రం సంకోచించకుండా ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నారు. తల్లి నిశ్చింతగా పరీక్ష రాసేలా భరోసా ఇచ్చారు. ఒకవైపు తన డ్యూటీ చేస్తూనే, మరోవైపు చిన్నారి ఏడవకుండా ఆప్యాయంగా ఎత్తుకుని ఆడించారు. షర్పుద్దీన్ చూపిన ఈ చొరవతో ఆ మహిళ ప్రశాంతంగా పరీక్ష రాయగలిగింది. ఒక తల్లి కలను సాకారం చేసేందుకు అండగా నిలిచిన షర్పుద్దీన్‌పై అక్కడున్న వారంతా ప్రశంసలు కురిపించారు. ఖాకీ దుస్తుల వెనుక కూడా ఒక సున్నితమైన, కన్నతల్లి లాంటి మనసు ఉంటుందని షర్పుద్దీన్ నిరూపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతుండటంతో, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు.

You might also like