కోర్టు మెట్లెక్కిన అంగన్‌వాడీలు
మంచిర్యాల : అంగన్‌వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు అంగన్‌వాడీ టీచర్లు కోర్టు మెట్లెక్కారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పలువురు టీచర్లు ఈ విషయమై కోర్టులో పిటిషన్ వేశారు. పరీక్షల్లో తమ శాఖ అధికారులు చెప్పింది వేరు, వాస్తవానికి జరిగిందని వేరని వారు పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి తమకు ఇచ్చిన గైడ్స్‌లైన్స్ లో 90 ప్రశ్నలు, 45 మార్కులు అని చెప్పారని తెలిపారు. కానీ పరీక్షల్లో మాత్రం ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదవ తరగతి కనీస అర్హతగా గ్రేడ్ 2 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి చెప్పిన అధికారులు, పరీక్షల్లో మాత్రం గ్రూప్ 1 స్థాయిలో ప్రశ్నాపత్రం ఇచ్చారని వాపోయారు. తమ శాఖకు సంబంధించిన పరీక్షలు తమ శాఖ వారే నిర్వహించే ఆనవాయితీ ఉండేదని, కానీ ఇప్పుడు మాత్రం జేఎన్‌టీయూ అధికారులు పరీక్షలు నిర్వహించిన విషయాన్ని వారు కోర్టుకు వెల్లడించారు. ఇక ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు చెప్పడంతో జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు వెల్లడించామన్నారు. నాలుగు తప్పులు పోతే ఒక మార్కు తీసేస్తామని చెప్పారని అయితే ఓఎంఆర్ షీట్‌లో తమకు వచ్చిన మార్కులు, వారు చెప్పిన వాటితో సరిపోలడం లేదని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ 21 వరకు అభ్యంతరాలు చెప్పాలని కోరారని తాము అభ్యంతరాలు వెల్లడించినా దానిపై తమకు అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో పోస్టింగ్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది.