ఈటలకు భద్రత ఇలా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Etala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్ (Etala Rajender), ఆయన సతీమణి జమున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై-ప్లస్ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈటలకు వై-ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది.
ఈటల రాజేందర్‌పై హత్యకు కుట్ర విషయం బయటికి రావటంతో.. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.. వై- ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని భావించింది. అయితే.. ఈటలకు తెలంగాణ ప్రభుత్వమే సెక్యూరిటీ కల్పించాలని భావించింది. ఈటల భద్రత విషయంలో మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించాలని డీజీపీకి ఫోన్ చేసి మరీ చెప్పారు. వెంటనే స్పందించిన డీజీపీ అంజనీ కుమార్.. ఈటల చేసిన ఆరోపణలపై వివరాలు సేకరించాలని మేడ్చల్ డీసీపీ సందీప్ రావును ఆదేశించారు.
ఆయన నివాసానికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు బృందం.. ఆయనను, ఆయన భార్య జమునతో ఈ విషయమై చర్చించారు. ఈటలకు ఎదురైన సంఘటనలన్నీ పోలీసులకు వివరించారు. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో ఉన్నప్పుడు పలు అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈటల వివరించారు. ఈటెల భద్రతపై సీల్డ్ కవర్లో డీసీపీ.. డీజీపీకి రిపోర్ట్ అందజేశారు. ఆ నివేదిక పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ముప్పు ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది.