50 శాతం లోటు వర్షపాతమే…
-జులైలో వర్షాలపై వాతావరణశాఖ నివేదిక
-నేడు, రేపు రాష్ట్రంలో వానలు
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా తెలంగాణను తాకాయి. గతేడాది మే చివరి వారంలోనే రాష్ట్రాన్ని తాకగా.. ఈ ఏడాది మాత్రం జూన్ 20 తర్వాత రుతు పవనాలు పలకరించాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజులు విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు సాగుబాటపట్టారు. ఇప్పటికే విత్తనాలు విత్తుకున్నారు. అయితే, నాలుగు రోజులుగా విపరీతంగా ఎండలు కాయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తిన విత్తనాలు మొలకెత్తే సమయంలో ఇలా ఎండలు కాస్తే ఇబ్బందికరమని ఆందోళన చెందుతున్నారు.
జూన్లో సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని.. సాధారణం కన్నా 20 శాతానికి పైగా లోటు ఉంటే తీవ్ర వర్షాభావం ఉన్నట్లు పరిగణిస్తామని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గత మూడేళ్లలో ఎప్పుడూ జూన్లో 50 శాతం లోటు నమోదు కాలేదన్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పెద్దపల్లిలో 77 శాతం, జగిత్యాల, హనుమకొండ జిల్లాల్లో 72 శాతం తక్కువవర్షం కురిసిందన్నారు. నారాయణపేట జిల్లాలో మాత్రమే 6 శాతం లోటు ఉందన్నారు.
ఈ నెల తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారతవాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. జులై 4 నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేశారు. జూలై రెండవ వారంలోనూ సాధారణ వర్షపాతం, 3, 4వ వారాల్లో రాష్టవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.