కాంగ్రెస్‌లో కయ్యం
-నేతల మధ్య ఆగని వార్
-స్థానికేతరుడు అంటూ వినోద్‌పై ప్రచారం
-ఎత్తుకు పై ఎత్తు వేసిన మాజీ మంత్రి
-మాజీ ఎమ్మెల్సీ ప్రేమాసాగర్ రావుపై చెక్ బౌన్స్ కేసు
-రాహుల్ పర్యటన సందర్భంగా మీడియాకు లీకులపై చర్చ

Congress: మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావును ఇరుకున పెట్టేందుకే మాజీ మంత్రి వినోద్ చెక్ బౌన్స్ కేసు పెట్టారా..? తనను స్థానికేతరుడు అని ప్రచారం చేస్తున్నందుకు ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారా..? ఒకవేళ తనపై దుష్ప్రచారం చేస్తే ఈ కేసు ద్వారా తనకు అడ్డంకులు లేకుండా కావాలని అనుకుంటున్నారా..? రాహుల్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మీడియాకు లీకుల వెనక ఆంత్యరం ఏమిటి..? మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కయ్యంపై నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, మాజీ మంత్రి గడ్డం వినోద్ వర్గాల మధ్య రాజకీయ రగడ నిత్యకృత్యమైపోయింది. ముఖ్యంగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తన అనుచరులను ఎమ్మెల్యే బరిలోకి దించాలని తాపత్రయపడుతున్నారు. అయితే, మాజీ మంత్రి గడ్డం వినోద్ దీనికి అడ్డుగా ఉన్నారు. ఆయన సైతం ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆయనను ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశంతో ప్రేంసాగర్ రావు ఎత్తులు వేశారు. వినోద్ స్థానికేతరుడని, ఆయనకు టిక్కెట్టు ఎలా ఇస్తారని బెల్లంపల్లి నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. వినోద్‌కు టిక్కెట్టు ఇస్తే తాము సహకరించమని సైతం తెగేసి చెబుతున్నారు. దీని వెనక ప్రేంసాగర్ రావు ఉన్నారన్నది నిర్వివాదంశం.
ఇక, తనకు రాజకీయంగా చికాకు తెప్పిస్తున్న ప్రేంసాగర్ రావును ఇరుకున పెట్టేందుకు మాజీ మంత్రి వినోద్ ఎత్తుకు పై ఎత్తు వేశారు. ఇన్ని రోజులుగా సమయం కోసం కాచుకున్న ఆయనకు ప్రేంసాగర్ రావు ఇచ్చిన చెక్కు ఆయుధంగా మారింది. ప్రేంసాగర్ రావు గత ఏడాది జూన్ 25న వినోద్ వద్ద రూ. 25 లక్షలు తీసుకున్నారు. అవసరం ఉందని, నెల రోజుల తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పాడని వినోద్ చెబుతున్నారు. గడువు దాటాక మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని పలుమార్లు వినోద్, ప్రేంసాగర్ రావును అడిగారు. గత ఏడాది నవంబర్ లో ప్రేంసాగర్ రావు ఓ చెక్ ఇచ్చారు. నెల తర్వాత డ్రా చేసుకోవాలని చెప్పడంతో మూడు నెలల పాటు వేచి చూసి ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. అందులో డబ్బులు లేకపోవడంతో బ్యాంకు నుంచి మెమో వచ్చింది. ఆ విషయం ప్రేంసాగర్ రావుకు చెబితే మరో చెక్ ఇచ్చారు. అది కూడా బౌన్స్ అయింది. దీంతో తనకు డబ్బు ఇవ్వాలని పలుమార్లు కోరినా ప్రేంసాగర్ రావు నుంచి సరైన స్పందన రాలేదని మాజీ మంత్రి వినోద్ చెబుతున్నారు.
దీనిపై మాజీ మంత్రి వినోద్ మాట్లాడుతూ ప్రేంసాగర్ రావు నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఫోన్లు చేసినా స్పందించపోవడంతో చివరకు న్యాయవాదితో లీగల్ నోటీసు పంపానని తెలిపారు. అయినా స్పందించకపోవడంతో జూన్ 27న హైదరాబాద్ కోర్టులో కేసు వేశానని వెల్లడించారు. తాను ఎన్నిసార్లు ప్రేంసాగర్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఆయన పట్టించుకోలేదని అందుకే కేసు వేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి వినోద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టు ప్రేంసాగర్ రావుకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందోనని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు, మాజీ మంత్రి వినోద్ సైతం ఈ సమయంలో చెక్‌బౌన్స్ కేసు అంశాన్ని తెర పైకి ఎందుకు తెచ్చారన్న చర్చ సైతం సాగుతోంది. జూన్ 27న కోర్టులో కేసు వేశారు. అప్పుడు విషయం బయటకు పొక్కలేదు.కానీ, కావాలనే మీడియాకు లీకులిచ్చి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతల్లో నానేలా ప్లాన్ వేశారని చెబుతున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావును ఇరుకున పెట్టేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు. తనను ఇబ్బంది పెట్టిన ప్రేంసాగర్ రావుపై ఆయన ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం మరింత వేడి రాజేస్తుందా..? లేక అధిష్టానం వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చుతుందా..? కొద్ది రోజుల్లో తేలనుంది.